ManaEnadu:శ్రావణమాసం (Sravanamasam) ముగింపునకు వచ్చేసింది. తెలుగు ఆడపడుచులంతా ఈ నెల మొత్తం అమ్మవారికి పూజలు చేస్తూ భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. తెలుగు లోగిళ్లలో చాలా వరకు ఈ మాసంలో మాంసాహారం ముట్టరు. ఇక ఆడపడుచులు పూజలు, ఉపవాసాలతో దైవ చింతనలో బిజీబిజీగా గడుపుతుంటూరు. ఇప్పటికే చాలా మంది వరలక్ష్మీ వ్రతం (Varalakshmi Vratam) చేసుకుని అమ్మవారి కటాక్షాన్ని కూడా పొందారు.
ఇక శ్రావణమాసం చివరి దశకు వచ్చింది. ఇవాళే (ఆగస్టు 30వతేదీ) చివరి శుక్రవారం. ఈ సందర్భంగా ఇవాళ మహిళలంతా అమ్మవారి ఆలయాలకు పెద్ద ఎత్తున పోటెత్తి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. మరోవైపు శ్రావణమాసం చివరి శుక్రవారం సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) మహిళలకు శుభవార్త చెప్పారు. ఇవాళ కాకినాడ జిల్లా పిఠాపురంలోని పాదగయలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించనున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఈ పూజల్లో పాల్గొనే మహిళా భక్తులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సొంత ఖర్చుతో ప్రత్యేక కానుకగా 12 వేల చీరలు అందజేయనున్నారు. పిఠాపురం నియోజకవర్గ ఆడపడుచులకు పవన్ కల్యాణ్ పసుపు కుంకుమ కానుక అంటూ ప్రత్యేకంగా తయారు చేసిన సంచుల్లో చీర, పసుపు, కుంకుమలను అందజేసేందుకు సిద్ధమయ్యారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని పవన్‌క ల్యాణ్ నివాసంలో రెండు రోజులుగా ఈ కార్యక్రమం జరుగుతోంది.
వ్రతాల్లో పాల్గొనే మహిళలు టోకెన్లు తీసుకునేందుకు గురువారం ఉదయం పాదగయ క్షేత్రంలో అధిక సంఖ్యలో పోటెత్తగా.. మధ్యాహ్నం 2 నుంచి 3.30 గంటల వరకు 2వేల మందికే టోకెన్లు ఇచ్చారు. ఇక ఇవాళ (శుక్రవారం) ఉదయం నుంచి సాయంత్రం వరకు మూడు విడతలుగా ఆరు వేల మందితో వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తామని ఈఓ దుర్గాభవాని తెలిపారు.