ManaEnadu:నిరుపేదలకు ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎంతో కాలం నుంచి ఎదురు చూసున్న పేద, మధ్య తరగతి ప్రజలకు త్వరలోనే రేషన్ కార్డులు మంజూరు చేయనుంది. ఈ మేరకు ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో గత కొన్నేళ్లుగా కొత్త రేషన్ కార్డులు(New ration cards) మంజూరు కావడం లేదు. అనేక మంది దీనిపై ఇబ్బందులు పెడుతున్నారు. ప్రజలు అర్జీలు పెట్టుకున్నా గత, ప్రస్తుత ప్రభుత్వాలు కొత్తరేషన్ కార్డులను మంజూరు చేయడానికి ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో మంత్రి నాదేండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు.
ఢిల్లీ పర్యటనలో..
ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి నాదెండ్ల మనోహర్ రేషన్ కార్డుల విషయమై కేంద్ర మంత్రులతో చర్చించారు. ఈ మేరకు కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, హరిదీప్‌సింగ్ పూరీలను కలిశారు. అనంతరం మీడియా సమావేశంలో మనోహర్ కొత్త రేషన్ కార్డుల ప్రకటన చేశారు. రేషన్ సరఫరాపై త్వరలోనే ఏపీలో కూటమి ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంటుందని వివరించారు. మరోవైపు కందిపప్పు కొరతపై కూడా మంత్రి స్పందించారు. కందిపప్పు ఏపీలోనే కాదు.. దేశంలోనే కొరత ఉందని చెప్పారు. అయినప్పటికీ సబ్సీడీపై ఏపీలో రూ.150కే అందిస్తున్నామని తెలిపారు.
లక్ష మెట్రిక్ టన్నుల కందిపప్పు
మరోవైపు కేంద్ర మంత్రులతో సమావేశంలో ఏపీకి లక్ష మెట్రిక్ టన్నుల కందిపప్పు కేటాయించాలని కోరినట్లు మనోహర్ తెలిపారు. ఈ మేరకు కేంద్రమంత్రి పహ్లాద్ జోషికి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. ఇటీవల బడ్జెట్‌లో గిడ్డంగుల కోసం కేటాయించిన నిధుల్లో అధికభాగం కేటాయించాలని కోరామన్నారు. విభజన తర్వాత రేషన్ కార్డుల విషయంలో అన్యాయం జరిగిందని. ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ రేషన్ కార్డులు తగ్గిపోయాయన్నారు. పేదలకు ఇబ్బంది కలగకుండా కోటి 47 లక్షల రేషన్ కార్డులకు రాష్ట్రం సరఫరా చేస్తోంది. జనాభా ప్రాతిపదికన రాష్ట్రానికి రేషన్ కార్డులు అమలు చెయ్యాలని కోరాం అని నాదెండ్ల మనోహర్ తెలిపారు.దీంతో పాటు ఏపీ పౌరసరఫరాల శాఖకు రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని కోరినట్లు మంత్రి మనోహర్ తెలిపారు.