Monkey Pox:మంకీపాక్స్‌ నిర్ధారణకు ఆర్టీ-పీసీఆర్‌ కిట్.. ఏపీ మెడ్‌టెక్‌ జోన్‌ ఘనత

ManaEnadu:ఎంపాక్స్.. అదేనండి మంకీపాక్స్.. ఇప్పుడు ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. కరోనా వైరస్ కమ్మిన చీకట్ల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా మరో మహమ్మారి దెబ్బ తీసేందుకు ముంచుకొస్తోంది. చాపకింద నీరులా ఆఫ్రికా దేశాలను వణికిస్తోంది. డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో, దాని చుట్టుపక్కల దేశాల్లో ఎంపాక్స్‌ వేగంగా వ్యాపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు కలిగించే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎంపాక్స్ కేసుల వ్యాప్తితో అత్యవసర ఆరోగ్య పరిస్థితిని ప్రకటించింది.

ఎంపాక్స్‌ కారక వైరస్‌లలో క్లేడ్‌ 1బీ అనే కొత్తరకం మరింత ప్రమాదకరమైందని.. ఇది ఎక్కువ ప్రాణాంతకంగా పరిణమించే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. తొలిసారి ఆఫ్రికాను దాటుకొని స్వీడన్​కు విస్తరించిన మంకీపాక్స్ మన పొరుగు దేశమైన పాకిస్థాన్‌కూ ​ విస్తరించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై జాగ్రత్త చర్యలు తీసుకుంది. ఇటీవలే దిల్లీ ఎయిమ్స్ కూడా మార్గదర్శకాలు విడుదల చేసింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మంకీపాక్స్ కట్టడిపై చర్యలకు ఉపక్రమించాయి.

మంకీపాక్స్ వ్యాప్తి నేపథ్యంలో.. ఇక తాజాగా ఏపీలోని విశాఖ ఏపీ మెడ్‌టెక్‌ జోన్‌ (ఏఎంటీజెడ్‌) తమ భాగస్వామి ట్రాన్సేషియా డయాగ్నస్టిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో కలిసి మంకీపాక్స్‌ వ్యాధి నిర్ధారణకు ఆర్టీ-పీసీఆర్‌ కిట్‌ను తయారు చేసింది. ఎర్బాఎండీఎక్స్‌ మంకీపాక్స్‌ ఆర్టీ-పీసీఆర్‌ పేరిట కిట్‌ను అభివృద్ధి చేసిన ఈ కిట్​కు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చి (ఐసీఎంఆర్‌) ధ్రువీకరణ లభించింది. దాంతో పాటు కేంద్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్‌ డ్రగ్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ నుంచి అత్యవసర అనుమతులు వచ్చాయి.

ప్రపంచ ఆరోగ్య ఆవిష్కరణల్లో భారతదేశం ముందంజలో ఉందనే విషయాన్ని ఇది ప్రతిబింబిస్తోందని మెడ్‌టెక్‌ జోన్‌ సీఈఓ డా.జితేంద్ర శర్మ తెలిపారు. ఆరోగ్యరంగంలో భారతదేశ ప్రతిభకు ఇదే తార్కాణమని వెల్లడించారు. ఇది రెండు వారాల్లో మార్కెట్లలోకి అందుబాటులోకి వస్తుందని చెప్పారు. కొవిడ్‌ విపత్తు సమయంలో ఆరోగ్యరంగానికి అవసరమైన అనేక ఆవిష్కరణలు చేసిన మెడ్‌టెక్‌ జోన్‌ .. రోజుకు ఒక మిలియన్‌ ఆర్టీపీసీఆర్‌ కిట్లు, 500 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు, 100 వెంటిలేటర్లు రూపొందించింది. ఇక ఇప్పుడు మంకీపాక్స్ వ్యాప్తి నేపథ్యంలో ఆర్టీ-పీసీఆర్ కిట్లు తయారు చేసింది.

Share post:

లేటెస్ట్