ManaEnadu:తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు (Heavy Rains in Telugu States) అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేని వానలతో ఇరు రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించిపోయింది. శనివారం ఉదయం నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని విజయవాడ (Record Level Rains in Vijayawada)లో 30 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఒకేరోజు 29 సెంటిమీటర్ల వాన కురిసింది.
రికార్డు స్థాయిలో వర్షం కురుస్తుండటంతో నగరం అస్తవ్యస్తమైంది. పలు కాలనీల్లో 4 అడుగుల మేర వరద నిలిచి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆటోనగర్ నుంచి బెంజ్ సర్కిల్ వరకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విజయవాడ (Vijayawada Rains) శివారు కండ్రిగ వద్ద రహదారిపై భారీగా నీరు నిలవడంతో విజయవాడ-నూజివీడు మధ్య రాకపోకలకు వాహనదారులు ఇబ్బందులు తలెత్తాయి. సింగ్‌నగర్, పైపుల రోడ్డు, సుందరయ్య నగర్, కండ్రిగ, రాజీవ్‌నగర్ వరద నీటిలో మునిగిపోయాయి.
నున్న ప్రాంతంలో అగ్నిమాపక శాఖ సిబ్బంది ఇళ్లు నీటమునిగాయి. రైల్వేట్రాక్ అండర్ పాస్ వద్ద 4 బస్సులు వరద నీటిలో చిక్కుకున్నాయి. విజయవాడలో అత్యంత భారీ వర్షం నేపథ్యంలో ఎక్కడా ప్రాణ నష్టం జరగకూడదనే ఉద్దేశంతో కొన్ని చోట్ల ముందు జాగ్రత్తగా విద్యుత్ సరఫరా (Power Cut) నిలిపివేశారు. స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడి వారి సూచనలకు అనుగుణంగా అధికారులు.. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు వేగవంతం చేస్తున్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో ఆయా జిల్లాల్లో పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు (AP CM Chandrababu) సమీక్షించారు. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయ చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. బాధితుల వద్దకు సహాయక బృందాలు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
మరోవైపు భారీ వర్షాల వల్ల విద్యుత్ శాఖకు జరిగిన నష్టంపై మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అధికారులతో సమీక్ష జరిపారు. వీటీపీఎస్‌లోకి భారీగా వర్షపు నీరు చేరడంతో 2500 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం కలిగింది. వర్షపు నీటిని తోడే పనులు నిర్విరామంగా జరుగుతున్నాయని అధికారులు మంత్రికి తెలిపారు.