Flash:అచ్యుతాపురం సెజ్‌లో ఘోర ప్రమాదం..  ఏడుగురు దుర్మరణం

ManaEnadu:ఏపీలోని అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం ఫార్మా సెజ్‌లో ఇవాళ మధ్యాహ్నం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అచ్యుతాపురం ఫార్మా  ఫార్మా సెజ్‌లో రియాక్టర్‌ పేలి ఏడుగురు దుర్మరణం చెందారు. మరో 50మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్ ఘటనాస్థలికి చేరుకున్నాయి. దట్టమైన పొగ అలుముకోవడంతో లోపల ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని అగ్నిమాపక దళాలు అంటున్నాయి.  ప్రమాద తీవ్రతను బట్టి మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు.

అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లోని ఎసెన్షియా అడ్వాన్సుడ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో వందల సంఖ్యలో కార్మికులు, సిబ్బంది పనిచేస్తుండగా .. ఇవాళ మధ్యాహ్నం భోజన విరామ సమయం మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. భారీగా మంటలు చెలరేగి దట్టంగా పొగ అలుముకుంది. ఏం జరుగుందో అర్థమయ్యేలోగానే చాలా మంది కార్మికులు అందులో చిక్కుకుపోయారు. అప్రమత్తమైన కొందరు వెంటనే ప్రాణభయంతో బయటకు పరుగులు తీసి పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. 

రియాక్టర్ పేలిన శబ్ధానికి సమీప గ్రామాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఫార్మా సెజ్ లోని అగ్నిమాపక యంత్రం సహా చుట్టుపక్కల నుంచి మరో 7 యంత్రాలతో మంటలు ఆర్పారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు. అయితే గాయాల పాలైన వారిలో ఐదుగురు 60 శాతానికిపైగా కాలినట్లు సమాచారం. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో దాదాపు 300 మంది కార్మికులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. రియాక్టర్‌ పేలుడు ధాటికి పరిశ్రమలోని మొదటి అంతస్తు శ్లాబు కూలిపోవడంతో ఆ శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. రెస్క్యూ టీమ్స్ వారిని బయటకు తీసే పనిలో పడ్డాయి. 

అచ్యుతాపురం సెజ్‌ ప్రమాద ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కలెక్టర్‌తో మాట్లాడి వివరాలు ఆరా తీశారు. తక్షణం సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఘటనపై ఎప్పటికప్పుడు తనకు సమాచారం అందించాలని స్థానిక నేతలకు సూచించారు. 

Share post:

లేటెస్ట్