‘ఈ జన్మ మీకోసం మీ శ్రేయస్సు కోసం’.. తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు బాలకృష్ణ భారీ విరాళం

ManaEnadu:భారీ వర్షాల (Rains in Telugu States) కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలు వరద నీటిలో మునిగాయి. చాలా ప్రాంతాలు ఇంకా వరద గుప్పిట్లోనే ఉన్నాయి. ఈ వరదల్లో ఎన్నో గ్రామాల ప్రజలు సర్వం కోల్పోయారు. ప్రస్తుతం తినడానికి తిండి, కట్టుకోవడానికి గుడ్డ, ఉండటానికి గూడు లేక పునరావాస కేంద్రాల్లో తల్లడిల్లుతున్నారు. ఇంకా కొందరు తమ ఇంటి టెర్రస్‌లపైనే సాయం కోసం ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో వరద బాధితుల (Flood Vicitms)ను ఆదుకునేందుకు ప్రముఖ రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. వారికి అండగా నిలిచేందుకు తమ వంతు సాయం చేస్తున్నారు. ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి చాలా మంది ప్రముఖులు విరాళాలు ప్రకటించారు. తాజాగా ఆ జాబితాలో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) చేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం ఆయన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి రూ.50 లక్షల చొప్పున మొత్తం కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. బాలయ్య మంచి మనసు చాటుకున్నారంటూ ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

“50 ఏళ్ల క్రితం మా నాన్నగారు స్వర్గీయ నందమూరి తారకరామారావు (NTR) గారు నా నుదుటిన తిలకం దిద్దారు. అది ఇంకా మెరుస్తూనే ఉంది. ఇప్పటికీ నా నట ప్రస్థానం సాగుతూనే ఉంది. వెలుగుతూనే ఉంది. తెలుగు భాష ఆశీస్సులతో, తెలుగు జాతి అభిమాన నీరాజనాలతో పెనవేసుకున్న బంధం నాది. ఈ రుణం తీరనిది.  ఈ జన్మ మీకోసం.. మీ ఆనందం కోసం. నా ఈ ప్రయాణంలో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు. అయితే ప్రస్తుతం తెలుగు నేలను వరద (Floods in Telugu States ముంచెత్తుతోంది. ఈ విపత్కర పరిస్థితులలో బాధాతప్త హృదయంతో నా వంతు సాహయం చేయదలిచాను. అందుకే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు నా బాధ్యతగా బాధిత ప్రజల సహాయార్థం విరాళంగా అందిస్తున్నాను. రెండు రాష్ట్రాలలో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.’’ – మీ నందమూరి బాలకృష్ణ.

Share post:

లేటెస్ట్