Airtel: తెలుగు రాష్ట్రాల్లో వరద విలయం.. బాధితులకు ఎయిర్‌టెల్‌ బంపర్ ఆఫర్‌

ManaEnadu:తెలుగు రాష్ట్రాల్లో గత రెండ్రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలు (Telangana Rains) పెను విలయం సృష్టించిన విషయం తెలిసిందే. ఇరు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాలు వరదనీటిలో చిక్కుకున్నాయి. ఇప్పటికీ చాలా ప్రాంతాలు వరద ముంపులోనే ఉన్నాయి. వరద చుట్టుముట్టి బయటకు రాలేక బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న వారిని బయటకు తీసుకు వచ్చేందుకు ప్రభుత్వాలు శ్రమిస్తున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో (Telugu States Floods) సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో వరద బాధితుల ప్రస్తుత పరిస్థితులు చూసి చలించిపోయిన చాలా మంది ప్రముఖులు భారీగా విరాళాలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు, వరదల దృష్ట్యా తెలుగురాష్ట్రాల్లోని వినియోగదారుల కోసం ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ (Bharti Airtel) కీలక నిర్ణయం తీసుకుంది. వరదల నేపథ్యంలో ఈ సంస్థ తని వినియోగదారులకు కొన్ని మినహాయింపులు ప్రకటించింది.
ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్‌ వినియోగదారులకు అదనంగా 4 రోజుల వ్యాలిడిటీ (Airtel Validity) ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. కాల్స్‌తోపాటు 4 రోజులపాటు రోజుకు 1.5 జీబీ మొబైల్‌ డేటాను ఉచితంగా అందించనున్నట్లు తెలిపింది. ఇక పోస్ట్‌పెయిడ్‌ వినియోగదారుల బిల్లు చెల్లింపునకు వారంపాటు గడువు పొడిగించినట్లు చెప్పింది. ఇంటికి వైఫై కనెక్షన్ ఉన్న వాళ్లకు 4 రోజుల అదనపు వ్యాలిడిటీని కల్పించినట్టు పేర్కొంది.

“విపత్కర పరిస్థితుల్లో వినియోగదారులకు ఇబ్బంది తలెత్తకూడదనే ఉద్దేశంతో మేం మినహాయింపులు ప్రకటించాం. విపత్తు సమయంలో ఎయిర్‌టెల్‌ నెట్‌వర్క్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఇలాంటి సమయంలో ఒకరికొకరికి తోడుగా నిలవడమే అసలైన మానవత్వం. వరదల సర్వం కోల్పోయిన వారు త్వరగా కోలుకోవాలని ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నాం. ధైర్యం కోల్పోకుండా ఉండాలని ఆశిస్తున్నాం.” అంటూ ఎయిర్‌టెల్ తన ప్రకటనలో పేర్కొంది.

Share post:

లేటెస్ట్