Rain Alert: బంగాళాఖాతంతో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన

Mana Enadu: తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. గత కొంతకాలంగా తెలంగాణలోని హైదరాబాద్ మినహా అన్ని ప్రాంతాల్లో వరుణుడు ముఖం చాటేశాడు. అటు ఏపీలోనూ కొన్ని రోజులుగా వానలు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. వేసిన పంటలు ఎండిపోతున్నాయని బాధపడుతున్న క్రమంలో వాతావరణ శాఖ రెండు తెలుగు రాష్ట్రాలకు తీపి కబురు చెప్పింది. వచ్చే ఐదు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని పేర్కొంది. పైగా దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు తెలిపింది.

దీని ప్రభావంతో వచ్చే 24 గంటల్లో కోస్తా జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, ఉభయ గోదావరి జిల్లాలు, కర్నూలు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఇక అల్పపీడనం ప్రభావంతో తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. సముద్రం అంతా అల్లకల్లోలంగా ఉంటుందని.. మత్స్యకారుల వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.

మరోవైపు తెలంగాణలోని కరీంనగర్, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్, పెద్దపల్లి, సిరిసిల్ల, వికారాబాద్, జగిత్యాల, నిజామాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది.

Share post:

లేటెస్ట్