వరద బాధితులకు రామ్ చరణ్ రూ.కోటి విరాళం.. తన వంతు సాయం ప్రకటించిన అనన్య నాగళ్ల

ManaEnadu:తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల కోసం టాలీవుడ్ నటులు(Tollywood Actor) కదిలి వస్తున్నారు. సీనియర్ హీరోలు, స్టార్ నటులు, యంగ్ హీరోలు అందరూ కలిసి తమ వంతు సాయంగా విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే సీనియర్ హీరోలయిన మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), బాలకృష్ణ, నాగార్జున భారీగా విరాళాలు ప్రకటించగా, పాన్ ఇండియా స్టార్లు ప్రభాస్ (Prabhas), అల్లు అర్జున్, ఎన్టీఆర్ కూడా తమవంతు సాయంగా విరాళాలు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఇక తాజాగా ఈ జాబితాలో గ్లోబల్ స్టార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా చేరారు.

తన అభిమానులను ఆదుకోవడంలో ఎప్పుడూ ముందుడే రామ్ చరణ్ (Ram Charan) ఈసారి తెలుగు ప్రజల కోసం తన వంతు సాయం చేశారు. తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకొచ్చిన ఆయన కోటి రూపాయల విరాళం ప్రకటించారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు రూ. 50 లక్షల చొప్పున రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి రూ. కోటి విరాళం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు.

‘‘వర్షాలు, వరదల (Floods) వల్ల ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు మనం తోడుగా.. అండగా ఉన్నామంటూ చేయూత అందించాల్సిన సమయమిది. నా వంతు బాధ్యతగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్‌లకు కోటి రూపాయలు విరాళంగా ప్రకటిస్తున్నా. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ పరిస్థితి నుంచి త్వరగా బయటపడాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’’ అని రామ్ చరణ్ తాను పెట్టిన పోస్టులో పేర్కొన్నారు.

మరోవైపు వకీల్ సాబ్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిలో చోటు దక్కించుకున్న యంగ్ నటి అనన్య నాగళ్ల (Ananaya Nagalla) కూడా తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. తనవంతు సాయంగా రెండు రాష్ట్రాలకు రూ.5 లక్షలు ప్రకటించింది. తెలంగాణ, ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రుల సహాయనిధికి రూ.2.5 లక్షల చొప్పున మొత్తం రూ.5 లక్షలు ఇస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఈ భామ పోస్టు పెట్టింది.

Share post:

లేటెస్ట్