Mana Enadu: అతి తక్కువ కాలంలో అధిక లాభాలు పొందేందుకు చాలామంది ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తుంటారు. అయితే మార్కెట్ హెచ్చుతగ్గుల గురించి ఎలాంటి అవగాహనలేని వారు కూడా ట్రేడింగ్ చేయొచ్చా? ఇంతకీ దీనివల్ల లాభమా? నష్టమా? అసలు ఇంట్రాడే ట్రేడింగ్ అంటే ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం.
అసలేంటీ ఈ ఇంట్రాడే ట్రేడింగ్..
స్టాక్‌ని ఒక రోజులో కొనుగోలు చేసి, తిరిగి అదే రోజు విక్రయించడాన్ని ఇంట్రాడే ట్రేడింగ్ అని అంటారు. ఇది ఇన్వెస్ట్మెంట్ కన్నా భిన్నంగా ఉంటుంది. అందులో షేర్లను చాలారోజుల పాటు హోల్డ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇంట్రాడేలో అలా కాదు. షేర్లను కొన్నరోజే అమ్మేయాలి. తర్వాత రోజుకు కొనసాగించడానికి వీలు ఉండదు. సాధారణంగా సగటు ఇన్వెస్టర్లు షేర్లను కొని వాటి ప్రైజ్ పెరిగాక అమ్మేస్తుంటారు. అయితే షేర్ ప్రైజ్ పెరుగుతుందా? తగ్గుతుందా? అనేది మనం ముందుగానే ఆర్థం చేసుకొని.. దాని ప్రకారం ట్రేడింగ్ చేయాలి.
సెబీ నిబంధనలు ఏంటంటే..
ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఓ వెసులుబాటు ఉంటుంది. అదే లెవరేజ్. అంటే మన పెట్టుబడికి బ్రోకరేజ్ సంస్థలు మరికొంత డబ్బును ఆడ్ చేస్తాయి. సెబీ నిబంధనల ప్రకారం.. ఒక స్టాక్ మీద గరిష్ఠంగా 5రెట్లు లెవరేజ్‌ను ఇస్తాయి. ఉదాహరణకు రూ.1000లో ట్రేడ్ అవుతున్న 100 స్టాక్స్‌ను కొనుగోలు చేయాలంటే సాధారణంగా లక్ష రూపాయలు కావాలి. కానీ ఇంట్రాడేలో రూ.20 వేలు ఉంటే సరిపోతుంది.
మార్కెట్ సైకాలజీ నేర్చుకోవాలి
ట్రేడింగ్ చేయడానికి స్టాక్ మార్కెట్ సైకాలజీని నేర్చుకోవాలి. అలాగే మార్కెట్ గురించి తెలిసి ఉండాలి. ఒడిదొడుకులను సరిగ్గా అంచనా వేయగలగాలి. కొన్ని స్ట్రాటజీలు ఉంటాయి. వాటిని నేర్చుకోవాలి. ఇది చాలా రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. ఎంతో అనుభవం ఉన్నవాళ్లే ఇందులో నష్టాలు చవిచూస్తుంటారు. కాబట్టి డైరెక్ట్‌గా ట్రేడింగ్ చేయకూడదు. అందుకే అవగాహన కోసం కొన్నిరోజులు పేపర్ వర్క్ చేయండి.
నష్టపోయేవారే ఎక్కువ
2018-19తో పోలిస్తే 2022-23 ఆర్థిక సంవత్సరంలో ట్రేడింగ్ చేసేవారి సంఖ్య 3 రెట్లు పెరిగిందట. ఇందులో 48శాతం మంది 30 ఏళ్ల లోపు వారే ఉన్నారట. అయితే ఇలా ట్రేడ్ చేసేవారిలో కేవలం 30శాతం మంది మాత్రమే లాభపడుతున్నారని సెబీ స్టడీ వెల్లడించింది. ఇక రోజుకు 10 మంది ట్రేడ్ చేస్తుంటే అందులో 8 మంది నష్టపోతున్నారట. యువకులు, ఎలాంటి అవగాహన లేనివారు ట్రేడ్ చేయడం వల్లే నష్టపోతున్నారని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అందుకే ఆచితూచీ ట్రేడింగ్ చేయాలి.