Mana Enadu:కేరళలోని వయనాడ్‌లో ప్రకృతి సృష్టించిన పెను విపత్తు ఎన్నో కుటుంబాలను ఆగం చేసింది. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి గ్రామాలను నేలమట్టం చేసింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దాదాపుగా వారం రోజుల నుంచి భారత ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్, అటవీ శాఖ బృందాలు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రాణాలకు తెగించి మట్టి దిబ్బల్లో, కొండ చరియల్లో చిక్కుకుపోయిన వారిని కాపాడుతున్నారు.
ఈ నేపథ్యంలో వయనాడ్ లో ఇండియన్ ఆర్మీ చేపడుతున్న సహాయక చర్యలను చూసి మూడో తరగతి చదువుతున్న ఓ బాలుడు వారికి లేఖ రాశాడు. ఇప్పుడు ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ లేఖకు భారత సైన్యం కూడా సమాధానమిచ్చింది. చిన్నారి స్పందన చూసి చలించిపోయామని.. ఎంతో ప్రేరణ కలిగించిందని పేర్కొంది. ఇంతకీ ఆ చిన్నారి లేఖలో ఏం రాశాడంటే..
‘‘ప్రియమైన ఇండియన్ ఆర్మీ.. నేను పుట్టిన వయనాడ్‌లో ప్రకృతి విధ్వంసం సృష్టించింది. శిథిలాల కింద చిక్కుకున్న ఎంతో మంది ప్రజలను మీరు ప్రాణాలకు తెగించి కాపాడారు. ఆహారం లేకపోయినా బిస్కెట్లు తింటూ ప్రాణాలకు తెగించి కాపాడుతున్నారు. అప్పటికప్పుడు వంతెనలు నిర్మిస్తూ ఆ ప్రాంత ప్రజలను కాపాడటానికి మీరు చూపిస్తున్న ధైర్యం నాకు స్ఫూర్తినిచ్చింది. ప్రజల కోసం మీరు శ్రమిస్తున్న తీరు చూస్తుంటే గర్వంగా ఉంది. నేను కూడా ఏదో ఒకరోజు సైన్యంలో చేరి మీలాగా దేశాన్ని రక్షిస్తాను.’’ అని లేఖలో ఆ బాలుడు రాసుకొచ్చాడు.
బాలుడి లేఖను అందుకున్న ఆర్మీ అధికారులు ఎమోషనల్ అయ్యారు. ఇలాంటి ప్రేరణ వల్లే తాము దేశం కోసం మరింత కష్టపడి పని చేయాలనే ఇష్టం పెరుగుతుందని సోషల్ మీడియాలో ఆ బాలుడు రాసిన లేఖను పోస్టు చేశారు. ‘‘డియర్ రాయన్ నువ్వు మనస్ఫూర్తిగా రాసిన మాటలు మమ్మల్ని భావోద్వేగానికి గురి చేశాయి. ఆపద సమయంలో దేశ ప్రజలకు తోడుగా ఉండాలనేదే మా లక్ష్యం. నువ్వు ఆర్మీ యూనిఫామ్ ధరించి, మాతో కలిసి నిలబడే రోజు కోసం ఎదురు చూస్తుంటాం. దేశ ప్రజల కోసం అప్పుడు మనం కలిసి పోరాడదాం. నీ ధైర్యానికి, స్ఫూర్తికి ధన్యవాదాలు’’ అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఈ పోస్ట్ వైరల్ అవుతుండడంతో సైనికులు చేస్తున్న సేవలకు నెటిజన్లు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. మరోవైపు చిన్నారి ఆలోచనను కూడా ప్రశంసిస్తున్నారు.