ManaRnadu:హైదరాబాద్‌లోని చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని.. పెద్ద పెద్ద భవనాలు నిర్మించిన వారిపై హైడ్రా ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాకు ఫుల్ పవర్స్ ఇచ్చారు. అక్రమ కట్టడాలపై కొరఢా ఝుళిపించాల్సిందేనని.. ఎదురుగా ఎవరున్నా వదిలేది లేదని స్పష్టం చేశారు. తాజాగా కోకాపేట్ అక్షయ పాత్ర ఫౌండేషన్ సమీపంలో అనంతశేష స్థాపన ఉత్సవంలో పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. చెరువులు మన జీవనాధారం, సంస్కృతి. కొందరు శ్రీమంతులు విలాసాల కోసం చెరువుల్లో ఫామ్‌హౌస్‌లు నిర్మించారు. ఫామ్‌హౌస్‌ల డ్రైనేజీ నీరు చెరువుల్లో కలుపుతున్నారు. చెరువులను చెరబట్టిన వాళ్లను వదిలిపెట్టం. అక్రమార్కుల నుంచి చెరువులను విముక్తి చేస్తాం. ఒత్తిడి ఉన్నా వెనక్కి తగ్గకుండా అక్రమ నిర్మాణాలు కూల్చేస్తున్నాం. అక్రమ నిర్మాణాలు చేసిన వ్యక్తులు ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే స్థాయిలో ఉండొచ్చు. ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు అక్రమ నిర్మాణాలు చేసినా కూల్చివేస్తాం. అని హెచ్చరించారు.
ప్రకృతి సంపదను విధ్వంసం చేస్తే ప్రకృతి మన మీద కక్ష కడుతుందని సీఎం రేవంత్ అన్నారు. చెరువుల ఆక్రమణదారులకు సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర హెచ్చరిస్తూనే.. హైదరాబాద్‌ను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. చెరువులను ఆక్రమించిన వారి భరతం పడతామన్న ఆయన.. విద్యా, వైద్యం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రాధాన్యత అని తెలిపారు.
ఇక హెరిటేజ్ టవర్ గురించి మాట్లాడుతూ.. భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా ధ్యాన కేంద్రాన్ని నిర్మిస్తున్నారని చెప్పారు. ధ్యాన కేంద్రం ప్రారంభోత్సవానికి రావడం అదృష్టంగా భావిస్తున్నానని.. స్థలదాతలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని పేర్కొన్నారు. తెలంగాణకు కోకాపేట్ ఆర్థికక్షేత్రం అని.. సమాజంలోని వ్యక్తులకు స్ఫూర్తినిచ్చేలా హెరిటేజ్ టవర్ నిర్మాణం ఉంటుందని చెప్పారు. హెరిటేజ్ టవర్ నిర్మాణం 36 నుంచి 42 నెలల్లో పూర్తవుతుందని ఆశిస్తున్నామని అన్నారు.