Mana Enadu: ‘అశోకుడు చెట్లు నాటించాడు’ అన్ని మనం చిన్నపుడు చదువుకున్నాం కదా. అదే స్పూర్తితో రోడ్లకు ఇరువైపులా రకరకాల చెట్లు మన నాయకులూ నాటిస్తున్నారు. ఇందులో శంఖు రూపంలో (Cone shape)లో పచ్చగా, అందంగా, ఆకర్షణీయంగా కనిపించే ‘కోనోకార్పస్(Conocarpus Tree)’ మొక్కలు లేదా చెట్లు రహదారులు, గార్డెనింగ్, కమ్యునిటీ, అవెన్యూ ప్లాంటేషన్లలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. నగరాల్లో పచ్చదనాన్ని పెంచేందుకు భారత్, పాకిస్థాన్, అరబ్ సహా వివిధ దేశాలు గుబురుగా పెరిగే ఈ చెట్లను నాటి సంరక్షిస్తున్నాయి. అయితే ఇవి మానవాళికి మేలు చేసేవి ఐతే అందరికి మంచిదే. కానీ అన్ని చెట్లు మేలు చేస్తాయని అనుకోకూడదని, హాని చేసే చెట్లూ కూడా ఉన్నాయని పర్యావరణ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
APలో నరికివేయాలని ఆదేశాలు
పచ్చదనం, అందం కోసం పెంచే ఈ కోనోకార్పస్ పర్యావరణ(Environment), ఆరోగ్య సమస్యల(Health Issues)కు కారణం అవుతోందని వృక్ష, పర్యావరణ నిపుణులు(Botanists and environmentalists) ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగా కోనోకార్పస్ మొక్కల పట్ల వ్యతిరేకత ప్రారంభమైంది. ముఖ్యంగా తెలంగాణలోని గ్రామపంచాయతీల ఆధ్వర్యంలో గతంలో వీటిని బాగా పెంచేవారు. కానీ శాస్త్రవేత్తల సూచనల మేరకు హరిత వనాలు, నర్సరీల్లో కోనోకార్పస్‌ను పెంచవద్దని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల లిఖిత పూర్వక ఆదేశాలు కూడా జారీచేసింది. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో ఈ మొక్కలను సమూలంగా నిర్మూలించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాకినాడలో ఇప్పటికే 5వేల వరకు మొక్కలను తొలగించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ(Telangana)లో కూడా అటవీశాఖ అధికారులపై ఒత్తిడి పెరుగుతున్నది. తెలంగాణలో దాదాపు 10 కోట్లకు పైగా కోనోకార్పస్ మొక్కలు ఉన్నట్టు అంచనా.
అవన్నీ అపోహలు మాత్రమేనంటూ పిటిషన్
ఇదిలా ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌లో ఈ చెట్లను నరికివేయడంపై తాజాగా హైకోర్టులో పిల్(PIL) దాఖలైంది. కోనో కార్పస్ మొక్కలు/చెట్లను అకారణంగా కొట్టేయడాన్ని అడ్డుకోవాలని హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, మరో ఇద్దరు ఈ పిల్‌ను హైకోర్టులో వేశారు. కోనో కార్పస్ మొక్కలతో మానవాళికి, పర్యావరణానికి ముప్పు ఉందని శాస్త్రీయంగా నిరూపితం కాలేదని పిల్‌లో ప్రస్తావించారు. ఈ కోనో కార్పస్ మొక్కలు నాటొచ్చా లేదా అనేది శాస్త్రీయ అధ్యయనం చేసేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని పిల్‌లో కోరారు. కోనో కార్పస్ మొక్కలు, చెట్ల నుంచి వెలువడే పుప్పొడితో ఆస్తమా, అలర్జీ, శ్వాసకోశ సంబంధ వ్యాధుల బారిన పడతారని, అవి ఆక్సిజన్ విడుదల చేయవు అనడం అపోహలని పిల్‌లో ప్రస్తావించారు.