ManaEnadu:దేశంలో మరోసారి ఎన్నికల నగారా మోగనుంది. నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. అమర్‌నాథ్ యాత్ర ముగిసన వెంటనే ఈ ప్రక్రియ చేపట్టనుంది. జమ్మూకశ్మీర్, హరియాణా, ఝార్ఖండ్, మహారాష్ట్రలో ఈనెల 19 లేదా 20న అసెంబ్లీ ఎన్నికలను ప్రకటించే అవకాశం ఉంది. దీనిపై ఇప్పటికే కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ ఆయా రాష్ట్రాల అధికారులతో సమావేశమయ్యారు. కాగా, సెప్టెంబర్ 30లోపు ఈ నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.
అయితే కొంతకాలంగా జమ్మూకశ్మీర్‌లో జరుగుతున్న ఉగ్రదాడుల నేపథ్యంలో అక్కడ ఎన్నికలు నిర్వహించాలా? వద్దా? అనే దానిపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పాండురంగ్ స్పందించారు. అక్కడ ఏ శక్తీ ఎన్నికలను అడ్డుకోలేదని స్పష్టం చేశారు. కాగా దాదాపు 10 ఏళ్ల తర్వాత జమ్మూకశ్మీర్‌లో 90 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఎన్నికలు జరగనున్నాయి.
నేడు నోటిఫికేషన్ విడుదల..
మరోపైపు హరియాణాలోనూ ప్రస్తుత అసెంబ్లీ నవంబర్ 3తో ముగియనుంది. దీంతో త్వరలోనే 90 స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేందుకు సీఈసీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే అక్కడి అధికారులతో చర్చించింది. అటు మహారాష్ట్రలోనూ అసెంబ్లీ పదవీకాలం నవరంబర్ 26తో ముగియనుంది. అక్కడ 288 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అటు ఝార్ఖండ్‌లోని 82 అసెంబ్లీ సెగ్మంట్లకు ఎలక్షన్స్ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆగస్టు 16న సాయంత్రం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనుంది.