Mana Enadu:దేశంలో మరోసారి ఎన్నికల పండుగ రానుంది. ఇటీవల లోక్సభ ఎన్నికల ప్రక్రియ ముగియగా కేంద్రంలో ఎన్డీఏ(NDA) ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారాన్ని చేపట్టింది. దేశ వ్యాప్తంగా 44 రోజులపాటు సుదీర్ఘంగా సాగిన ఓటింగ్ ప్రక్రియలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం మరో ఎన్నికల నోటిఫికేషన్ను రిలీజ్ చేసింది. అందేంటంటే..
రాజ్యసభలో ఖాళీ అయిన 12 స్థానాలకు ఉప ఎన్నికల నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం( Election Commission) నిర్ణయించింది. ఈ మేరకు ఈసీ షెడ్యూల్ను విడుదల చేసింది. తొమ్మిది రాష్ట్రాల్లోని 12 స్థానాలకు సెప్టెంబర్ 3న ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుందని ఈసీ పేర్కొంది. పోలీ అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
ఈ ఉప ఎన్నికలకు సంబంధించి ఆగస్టు 14న నోటిఫికేషన్(notification) విడుదల కానుంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఆగస్టు 21. అసోం, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, త్రిపుర రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు ఈ నెల 26వ తేదీలోపు, బిహార్, హరియాణా, రాజస్థాన్, ఒడిశా తెలంగాణ(Telangana) రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు 27వ తేదీలోపు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు.
అసోం, బిహార్, హరియాణా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, త్రిపుర రాష్ట్రాల నుంచి 10 మంది సభ్యులు లోక్సభకు ఎన్నిక అయ్యారు. ఇక తెలంగాణ, ఒడిశా నుంచి ఒక్కొక్కరు తమ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. కే.కేశవరావు(K Keshavarao) బీఆర్ఎస్(BRS) నుంచి కాంగ్రెస్(Congress)లో చేరిన తర్వాత తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.