ManaEnadu:పోక్సో, నిర్భయ, దిశ, అపరాజిత (Aparajitha).. మహిళల రక్షణ కోసం ఇలాంటి ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఆడవాళ్లపై రోజురోజుకు పెరిగిపోతున్న అఘాయిత్యాలను ఆపలేకపోతున్నాయి. ఐదారు నెలల పసికందుల నుంచి అరవై ఏళ్ల పండు ముసలివాళ్ల వరకూ కామాంధుల చేతుల్లో బలైపోతూనే ఉన్నారు. కేవలం అత్యాచారాలే కాదు, గృహహింస, పనిచేసే చోట వేధింపులు ఇలా ఎన్నో రకాలుగా మహిళలు ప్రతిక్షణం ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు.
అయితే చిన్నారులు, మహిళలపై వేధింపులు, వారి రక్షణ కోసం అసలు మన భారతదేశంలో ఎలాంటి చట్టాలు ఉన్నాయి? అనే విషయం చాలా మందికి తెలియకపోవడం వల్ల బాధితులు వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. అందుకో భారతదేశంలోని ప్రతి మహిళ తెలుసుకోవాల్సిన చట్టాలు (Women Law Acts) కొన్ని ఉన్నాయి. మరి అక్కలూ మీ హక్కుల గురించి తెలుసుకునేందుకు రెడీయా?
పనికి తగ్గ వేతనం
సమాన పనికి సమాన వేతనం మహిళల హక్కు. కూలీలు మొదలుకొని.. ఉన్నతోద్యోగాలు చేసే మహిళల వరకు ‘సమాన వేతన చట్టం’ అమల్లో ఉంది. ఈ చట్టం ద్వారా మహిళలు తమ సహోద్యోగుల(పురుషులు)తో సమానమైన వేతనం డిమాండ్ చేయొచ్చు.
పని చేసేచోట రక్షణ
పని ప్రదేశంలో మహిళలపై సాధారణ, లైంగి వేధింపులు (Sexual Harassment) అనేకం. ఈ వేధింపులను అరికట్టేందుకు ఓ చట్టం ఉంది. పనిచేసే చోట లైంగిక వేధింపులకు గురైతే.. ఉన్నతాధికారులకు రిపోర్టు చేయొచ్చు. ఇందుకోసం ప్రతి కంపెనీ వేధింపులకు సంబంధించిన ఫిర్యాదుల కోసం అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఏర్పాటు చేయాలి.
గృహహింస
గృహహింస నిరోధక చట్టం (Domestic Violence)-2005 ఇంట్లో ఎదురయ్యే హింస నుంచి మహిళలను ఈ చట్టం రక్షిస్తుంది. శారీరక హింస మాత్రమే కాకుండా మానసికంగా మాటలతో వేధించినా, లైంగికంగా వేధించినా 498 సెక్షన్ ప్రకారం దోషులను కఠినంగా శిక్షించొచ్చు.
గోప్యత మీ హక్కు
లైంగిక వేధింపులకు గురైన మహిళలకు తమ వివరాలు తెలపకుండా ‘గోప్యత పాటించే హక్కు’ ఉంటుంది. ఈ చట్టం ప్రకారం బాధితురాలి పేరు, ఇతర వివరాలను వెల్లడించకూడదు. మేజిస్ట్రేట్ ఎదుట ఒంటరిగా లేదా మహిళా పోలీసు అధికారి సమక్షంలో తన వాంగ్మూలాన్ని నమోదు చేసుకునే హక్కు బాధితురాలికి ఉంటుంది.
ఫ్రీ న్యాయ సేవ
లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ (Legal Services Authorities Act).. అత్యాచార బాధితులకు ఉచిత న్యాయ సాయం అందిస్తుంది.
గౌరవానికి భంగం కలగొద్దు
లైంగిక వేధింపుల బాధితురాలికి ఏదైనా వైద్య పరీక్షలు అవసరమైతే కేవలం మహిళా వైద్యురాలి ద్వారానే పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇతరుల సమక్షంలో ఏ విధమైన శారీరక/ మానసిక పరీక్షలు నిర్వహించి తన గౌరవానికి భంగం కలిగించేటువంటి చర్యలు చట్టవిరుద్ధం.
రాత్రిపూట అరెస్టు వద్దు
సూర్యాస్తమయం తర్వాత, సూర్యోదయానికి ముందు.. మహిళలను అరెస్టు (Woman Arrest Laws) చేయొద్దు. తప్పనిసరి పరిస్థితులు ఎదురైనప్పుడు.. ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ ఆదేశంతో మాత్రమే రాత్రి సమయంలో మహిళలను అరెస్టు చేయొచ్చు. మరోవైపు మహిళా ఖైదీని ప్రశ్నించే సమయంలో మహిళా కానిస్టేబుల్‌తోపాటు ఆమెకు చెందిన కుటుంబసభ్యులు లేదా స్నేహితులు పక్కన ఉండొచ్చు.







