Mana Enadu: వాహనదారులకు అలర్ట్. ఆగస్టు నెల వచ్చేసింది. ఆగస్టు 1వ తేదీ నుంచి కొత్త ఫాస్టాగ్ రూల్స్ అమల్లోకి రానున్నాయి. మరి మీరు మీ కేవైసీ అప్డేట్ చేశారా.. చేయకపోతే త్వరపడండి. టోల్ ప్లాజాల వద్ద వేచి చూడకుండా.. ఇబ్బంది పడకుండా ఉండాలంటే.. తప్పకుండా ఫాస్టాగ్ ‘నో యువర్ కస్టమర్’ (కేవైసీ)ని అప్‌డేట్ చేసుకోవాలి.
గత మూడేళ్లలో తీసుకున్న ప్రతీ వాహనం ఫాస్టాగ్‌కు కేవైసీ తప్పనిసరి చేశారు. ఐదేళ్ల కంటే పాత ఫాస్టాగ్లుంటే తప్పక రీప్లేస్ చేసుకోవాలి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) జారీ చేసిన మార్గదర్శకాలను ఫాలో అయ్యారనుకోండి.. నేషనల్ హైవేలపై రాకపోకలకు మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎలాంటి అవాంతరాలు లేకుండా జాలీగా మీరు మీ ప్రయాణం సాగించవచ్చు.
అసలు ఈ ఫాస్టాగ్ అంటే ఏంటి..?
2019 నుంచి టోల్ ప్లాజాల వద్ద చెల్లింపులను సులభతరం చేయడం కోసం, ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరించడానికి తీసుకువచ్చిన తనిఖీ వ్యవస్థే ఫాస్టాగ్ వ్యవస్థ. దీన్ని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ఏఐ) నిర్వహిస్తోంది. ఫాస్టాగ్ వ్యవస్థ అనేది రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీని ఉపయోగించి టోల్ చెల్లింపులను సులభతరం చేస్తుంది. మరి ఈ కొత్త ఫాస్టాగ్ రూల్స్ ఏంటో తెలుసుకుందామా..?
ఫాస్టాగ్ కొత్త రూల్స్ ఇవే..
వాహనదారులు మాత్రమే వారి ఫాస్టాగ్ కేవైసీ అప్డేట్ చేసుకోవడం కాదు.. వారికి ఫాస్టాగ్‌లు జారీ చేసిన కంపెనీలు కూడా ఆగస్టు 1 నుంచి అలర్ట్ అయి.. మూడేళ్లలోపు ఫాస్టాగ్‌ల కేవైసీని అప్‌డేట్ చేయాలి.
అక్టోబరు 31లోగా ఐదేళ్ల కిందటి ఫాస్టాగ్‌లను రీప్లేస్ చేసే ప్రక్రియ పూర్తి చేయాలి. దీనివల్ల ఫాస్టాగ్ హోల్డర్లకు టోల్ ప్లాజాల వద్ద నిరంతరాయ సేవలు అందుతాయి.
ఆగస్టు 1 నుంచి ఫాస్టాగ్‌లన్నీ తప్పకుండా వాహన రిజిస్ట్రేషన్ నంబరు, ఛాసిస్ నంబర్‌తో లింక్ అయి ఉండాల్సిందే.
ప్రతి ఫాస్టాగ్ ఒక ఫోన్ నంబరుతో కనెక్ట్ అయి ఉంటుంది. దానికే మెసేజ్‌లు, అప్‌డేట్స్ వెళ్తుంటాయి.
కొత్తగా వాహనాలు కొనే వారు తమ వాహన రిజిస్ట్రేషన్ నంబరును మొదటి 90 రోజుల్లోగా అప్‌డేట్ చేయించుకోవాలి.
ఫాస్టాగ్ జారీ చేసే కంపెనీలకు వాహనదారులు పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడి సమాచారాన్ని అందించాలి.
వాహనం ముందు భాగం, వెనుక భాగానికి సంబంధించిన స్పష్టమైన ఫొటోలను ఫాస్టాగ్ సర్వీస్ ప్రొవైడర్‌కు అందించాలి.
అక్టోబరు 31దాకా టైం ఉంది కదా అని వాహనదారులు ఎదురుచూడకుండా.. సాధ్యమైనంత త్వరితగతిన కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి.