సూర్యాపేట జిల్లా మోతే వద్ద ఉదయం ఆటో రిక్షాను TSRTC బస్సు ఢీకొనడంతో నలుగురు మహిళా కూలీలు, ఒక వ్యక్తి మృతి చెందగా, మరో 11 మంది గాయపడ్డారు.
వ్యవసాయ కూలీలైన ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా, నాలుగో మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతులను విజయరాఘవపురానికి చెందిన కందుల నాగమ్మ (50), చెవుల నారాయణమ్మ (50), మునగాల మండలం వేపాలకు చెందిన పాకాల అనసూర్య (47), సౌభాగ్యమ్మ (45)గా గుర్తించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన వ్యక్తిని కందుల గురవయ్య (57)గా గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూలీలు బూర్కచెర్ల వద్ద పనికి వెళ్తుండగా మదిర డిపోకు చెందిన బస్సు ఆటోను వెనుక నుంచి ఢీకొట్టింది. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, సౌభాగ్యమ్మ మృతి చెందింది.
గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆటో రిక్షా డ్రైవర్ సొంపంగు పవన్‌కు కూడా గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోరిక్షాలో 15 మంది ప్రయాణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.