Shiv Nadar: చిన్న గ్రామం నుంచి వచ్చి.. టెక్ దిగ్గజంగా ఎదిగి! శివ్ నాడార్ లైఫ్ స్టోరీ ఇదే..

Mana Enadu: అది 1970వ సంవత్సరం. ఐబీఎం(IBM) వంటి విదేశీ టెక్ దిగ్గజాలు మన భారత మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అప్పటికి మన దేశంలో పేరున్న స్వదేశీ ఐటీ సంస్థలేమీ(IT Companies) లేవు. దీంతో తమిళనాడులోని ఓ చిన్న గ్రామానికి చెందిన ఓ సాధారణ పౌరుడు.. ఢిల్లీ క్లాత్ మిల్స్‌లో ఇంజినీరుగా పనిచేస్తున్న ఓ యువకుడు సాహసోపేతమైన మిషన్‌ను ప్రారంభించారు. భారతదేశం స్వదేశీ సాంకేతికతతో ప్రపంచ వేదికపై పోటీపడే భవిష్యత్తును ముందుగానే ఊహించారు. ఆయనే ప్రస్తుతం దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సేవల సంస్థగా కొనసాగుతున్న హెచ్‌సీఎల్(HCL) వ్యవస్థాపకుడు శివ్ నాడార్(Shiv Nadar). కొన్ని దశాబ్దాల క్రితమే.. టెక్ కంపెనీకి బీజాలు నాటిన ఆయన బిజినెస్ సక్సెస్ స్టోరీని ఇప్పుడు తెలుసుకుందాం.

1976లో హిందుస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్‌ స్థాపన

శివ్ నాడార్.. 1976లో హిందుస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్‌ని ప్రారంభించారు. అక్కడితో ఆగిపోని ఆయన మరో రెండేళ్ల వ్యవధిలోనే హెచ్‌సీఎల్ 8Cని సృష్టించారు. ఆ తర్వాత గ్లోబల్ సామర్థ్యాన్ని గుర్తించిన ఆయన 1980లో సింగపూర్‌లో ఫాస్ట్ ఈస్ట్ కంప్యూటర్‌లను స్థాపించి.. దాన్ని అంతర్జాతీయ మార్కెట్‌లకు విస్తరించారు. 1984లో BusyBee అనే వ్యక్తిగత కంప్యూటర్‌ని ప్రారంభించడంతో ఆయన జీవితంలో ఆసలైన పురోగతి మెుదలైంది.
BusyBee కంప్యూటర్లకు అమెరికా మార్కెట్లలో నష్టాలు వచ్చాయి. దీంతో ఆయన.. 1991వ సంవత్సరంలో HP కంపెనీతో భాగస్వామ్యం ఏర్పరచుకున్నారు. ఈ దెబ్బకి 2001 నాటికి HCL భారతదేశంలోనే అగ్ర డెస్క్‌టాప్ తయారీ సంస్థగా అవతరించింది. ప్రస్తుతం మన దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సేవల సంస్థగా కొనసాగుతోంది. HCL టెక్నాలజీస్ ప్రస్తుత మార్కెట్ క్యాప్ రూ.4.26 లక్షల కోట్లుగా ఉంది.

 ఎంతోమందికి శివ్ ఆదర్శం..

ఎడెల్‌గివ్‌ హురున్‌ ఇండియా దాతృత్వ జాబితా-2023 ప్రకారం.. ఆయన ఒక సంవత్సరం వ్యవధిలోనే రూ.2042 కోట్లు విరాళంగా ఇచ్చారు. అంటే రోజుకు సగటున 5.6 కోట్లు దానాల రూపంలో వివిధ కార్యక్రమాలకు ఆయన ఖర్చు చేశారు. ఆ నివేదిక ప్రకారం.. అత్యధికంగా విరాళాలు ఇచ్చినవారిలో ఆయన తొలి స్థానంలో నిలిచారు. భారత్ వంటి అధిక జనాభా కల్గిన దేశంలో.. ప్రపంచమంతా గుర్తించదగిన వ్యాపారవేత్తగా ఎదగడం అంత సులువైన విషయం కాదు. కానీ, ఆయన పట్టుదలతో కలను సాకారం చేసుకున్నారు. లక్ష్య సాధనలో ఎదురైన సమస్యలను అధిగమించి శిఖరాన్ని చేరుకున్నారు. ఓ వ్యక్తి తను అనుకున్నది సాధించాలంటే.. పట్టుదల చాలా ముఖ్యమని ఆయన సక్సెస్ స్టోరీ ద్వారా మనం నేర్చుకోవచ్చు.

Share post:

లేటెస్ట్