Mana Enadu: వర్షాలు ప్రారంభమైన వెంటనే దోమల వల్ల వచ్చే రోగాల ప్రమాదం పెరుగుతోంది. ప్రధానంగా వర్షాకాలంలో డెంగ్యూ తీవ్రంగా వ్యాప్తి చెందుతోంది. వానాకాలంలో దోమల వ్యాప్తి అధికంగా ఉండటంతో ఈ వ్యాధి సంక్రమిస్తోంది. ప్రభుత్వాలు, ఆరోగ్య శాఖలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. ఏటా ఇదే పరిస్థితి నెలకొంటోంది. ఈ క్రమంలో దోమల నివారణ చర్యలపై ప్రతి ఒక్కరూ సీరియస్‌గా దృష్టి సారించాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
డెంగ్యూతో గర్భిణి, కవలలు మృతి
తాజాగా హనుమకొండ జిల్లాలో ఓ గర్భిణి, కవలలు డెంగ్యూతో మరణించారు. శాయంపేట మండలం గట్లకానిపర్తికి చెందిన బొమ్మకంటి శిరీష(29) నిండు గర్భిణి. స్కానింగ్‌లో కవలలు ఉన్నారని తేలడంతో తగు జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నారు. మరో వారం రోజుల్లో ప్రసవం కావొచ్చని వైద్యులు తేదీ కూడా ఇచ్చారు. అంతలోనే శిరీషకు జ్వరం సోకడంతో కుటుంబసభ్యులు నాలుగు రోజుల కిందట హనుమకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు డెంగీ జ్వరంగా అనుమానించి అందుకు సంబంధించిన చికిత్స మొదలుపెట్టారు. గురువారం ఉదయం ప్లేట్లెట్లు తగ్గి ఆమె పరిస్థితి విషమించింది. పురిట్లోని కవలల్ని అయినా బతికించాలని వైద్యులు సిజేరియన్ చేశారు. కానీ తల్లితోపాటు పిల్లలు కూడా మృతిచెందారు.
అధికారిక లెక్కల ఇదీ..
అధికార లెక్కల ప్రకారం 2023లో దేశవ్యాప్తంగా 2,89,235 డెంగ్యూ కేసులు నమోదవ్వగా 485 మంది మరణించారు. 2023లో తెలంగాణలో 8,972 కేసులు రాగా, ఏపీలో 6,453 కేసులు రికార్డయ్యాయి. ఇక 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 23,325 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఈ సంఖ్య 1078 కాగా, ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు 1836 డెంగ్యూ కేసులను అధికారులు గుర్తించారు. ఈ లెక్క అనధికారికంగా అధికంగానే ఉండొచ్చనేది కాదనలేని నిజం.
ఇవీ లక్షణాలు
డెంగ్యూ లక్షణాలు, సాధారణంగా సంక్రమణ తర్వాత నాలుగు నుంచి ఆరు రోజుల మధ్య ప్రారంభమవుతాయి. ఈ లక్షణాలు 10 రోజుల వరకు ఉంటాయి. అయితే జ్వర పీడితుల్లో ఎక్కువగా ఒకేరకమైన లక్షణాలు వుంటున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులు, వాంతులు, కొంతమందిలో తలనొప్పి, తల విసురుతుండడం వంటి లక్షణాలు ఉంటున్నాయంటున్నారు. వీరికి పరీక్షలు నిర్వహిస్తే కొందరికి డెంగ్యూ పాజిటివ్‌గా తేలుతుండగా, ఎక్కువమందిలో నెగటివ్ వస్తోందంటున్నారు. అయితే, వారిలో ప్లేట్‌లెట్స్ ఒక్కసారిగా తగ్గుముఖం పడుతుండడంతో ఆందోళన చెందుతూ ఆస్పత్రుల్లో చేరుతున్నారు.
డెంగ్యూ జ్వరాన్ని ఎలా నివారించాలి?
– ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
– ఇంటి లోపల కూడా దోమ తెరలను ఉపయోగించాలి.
– నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఒకవేళ ఉంటే అందులో పినాయిల్, బ్లీచింగ్ వంటివి చల్లాలి.
– బయట ఉన్నప్పుడు, పొడవాటి చేతుల చొక్కా, పొడవాటి ప్యాంటు, సాక్స్ ధరించాలి.
– అందుబాటులో ఉంటే, ఇంట్లో ఎయిర్ కండిషనింగ్ ఉపయోగించండి.
– విండో, డోర్ స్క్రీన్‌లు ఏర్పాటు చేసుకోవాలి.
– డెంగ్యూ లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.