Mana Enadu:ఇంటి పైకప్పుపై సోలార్ ప్లేట్స్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా విద్యుత్ బిల్లును తగ్గించుకునేందుకు ‘ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన’ పథకానికి కేంద్రం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా కోటి మంది ప్రజలకు సౌర విద్యుత్ ఏర్పాటుకు రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది.
ఇందులో భాగంగా రాయితీ కింద ఒక్కో కిలోవాట్‌కు రూ.30వేలు, రెండు కిలోవాట్లకు రూ.60 వేలు, 3 కిలోవాట్లకు మాత్రం రూ.18 వేలు సబ్సిడీ అందిస్తోంది. మూడు కిలోవాట్ల సోలార్ రూఫ్ టాప్‌ను ఏర్పాటు చేయడానికి రూ.1.45 లక్షలు ఖర్చయితే అందులో కేంద్రం గరిష్ఠంగా రూ.78 వేలు భరిస్తుంది. మిగిలింది పూచీకత్తు లేకుండా తక్కువ వడ్డీకే బ్యాంకు నుంచి రుణాలు పొందొచ్చు.
సూర్యఘర్ వెబ్‌సైట్ ప్రకారం: 1 కిలోవాట్‌కు సుమారు 120 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అంటే మీకు నెలకు రూ.1000 కరెంట్ బిల్లు వస్తే.. సోలార్ వల్ల రూ.338 మాత్రమే వస్తుంది. ఇలా మీరు 360 యూనిట్లు వినియోగించే వారికి ఏటా రూ.32వేల వరకు ఆదా అవుతుంది. మరి ఈ పథకం కోసం మీరూ దరఖాస్తు చేసుకోవాలని అనుకుంటున్నారా..? మరెందుకు ఆలస్యం ఇలా దరఖాస్తు చేసుకుంటే సరి?
సూర్యఘర్ పథకానికి ఇలా అప్లై చేసుకోవాలి..
Step 1: పీఎం సూర్యఘర్ (pmsuryaghar.gov.in) పోర్టల్‌లో పేరును రిజిస్టర్ చేసుకోవాలి. మీ రాష్ట్రం, విద్యుత్ సరఫరా చేసే కంపెనీని సెలక్ట్ చేసి మీ విద్యుత్ కనెక్షన్ కన్జ్యూమర్ నంబరు, మొబైల్ నంబరు, ఈ-మెయిల్ ఐడీని నమోదు చేయండి.
Step 2: కన్జ్యూమర్ నంబర్, మొబైల్ నంబర్‌తో లాగిన్ అయిన తర్వాత ‘రూఫ్‌టాప్ సోలార్’ ఆప్షన్ క్లిక్ చేయాలి.
Step 3: దరఖాస్తు పూర్తి చేసి డిస్కమ్ నుంచి అనుమతులు వచ్చేవరకు వేచి చూడాలి. పర్మిషన్ వచ్చిన తర్వాత మీ డిస్కమ్‌లోని నమోదిత విక్రేతల నుంచి సోలార్ ప్లాంట్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
Step 4: ఇన్‌స్టలేషన్ తర్వాత, ఆ ప్లాంట్ వివరాలను పోర్టల్‌లో సబ్మిట్ చేసి నెట్ మీటర్ కోసం అప్లై చేసుకోవాలి.
Step 5: నెట్ మీటర్‌ను ఇన్‌స్టాల్ చేశాక, డిస్కమ్ అధికారులు తనిఖీలు చేసి పోర్టల్ నుంచి కమిషనింగ్ సర్టిఫికేట్ ఇస్తారు.
Step 6: ఈ రిపోర్ట్ పొందిన తర్వాత మీ బ్యాంకు ఖాతా వివరాలతో పాటు క్యాన్సిల్డ్ చెక్‌ను పోర్టల్‌లో సమర్పించాలి. 30 రోజుల్లోగా మీ ఖాతాలో సబ్సిడీ జమ అవుతుంది.