ManaEnadu:హైదరాబాద్ (Hyderabad) మహానగరంలో రోజురోజుకు పెరుగుతున్న జనాభా, వారి వల్ల పెరుగుతున్న రద్దీని నియంత్రించేందుకు, ప్రయాణికుల అవసరాలు తీర్చేందుకు, వారిని సులభతరంగా సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు త్వరలో చర్లపల్లి రైల్వేస్టేషన్ అందుబాటులోకి రానుంది. నగరంలో ఇప్పటికే ప్రజా రవాణా కోసం మూడు ప్రధాన టెర్మినల్స్ సికింద్రాబాద్ (Secunderabad), హైదరాబాద్, కాచిగూడ (Kachiguda) ఉన్న విషయం తెలిసిందే.
తూర్పు భాగంలో ట్రాఫిక్‌కు చెక్..
ఇప్పుడు వీటికి తోడుగా చర్లపల్లి టెర్మినల్ (Cherlapally Terminal) కూడా యాడ్ కాబోతోంది. హైదరాబాద్‌కు తూర్పు వైపున ఉన్న చర్లపల్లి ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతోంది. జంట నగరాల్లో ఇతర రైలు టెర్మినల్స్‌లో రద్దీ తగ్గించేందుకు, మరోవైపు నగరంలోని తూర్పు భాగంలో ఉన్న ప్రయాణికులు సులభతరంగా తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు చర్లపల్లి టెర్మినల్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ టెర్మినల్ పనులు తుది దశకు చేరుకున్నాయి.
ఎయిర్‌పోర్టును తలపించేలా..
ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును తలపించేలా నిర్మించిన ఈ రైల్వే స్టేషన్‌ను ప్రధాని మోదీ త్వరలో ప్రారంభించనున్నారు. ఈ టెర్మినల్ అందుబాటులోకి వస్తే నాంపల్లి (Nampally), సికింద్రాబాద్, కాచిగూడ్ స్టేషన్లలో రద్దీ భారం తగ్గడమే కాకుండా ఘట్‌కేసర్ వద్ద ఔటర్ రింగ్ రోడ్ కూడా ఉండటంతో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్లపల్లి టర్మినల్‌కు చేరుకోవచ్చు.
నగరంలోని తూర్పు వైపున ఉండే ప్రజలకు ఈ టెర్మినల్ అందుబాటులోకి వస్తే ప్రయాణ భారం తగ్గుతుంది. చర్లపల్లి టెర్మినల్ వల్ల ఈ ప్రాంతంలో ట్రాఫిక్ (Traffic) కష్టాలు తీరి ప్రయాణికులు సులభతరంగా క్షేమంగా తమ గమ్యస్థానాలకు చేరుకోగలుగుతారు. ఈ స్టేషన్ నుంచి దూర ప్రాంతాలకు ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపాలని నిర్ణయించడం, ఇది ORRకు అతి సమీపంలో ఉండటంతో హైటెక్ సిటీ, మాదాపూర్ (Madhapur), శంషాబాద్ వంటి ప్రాంతాల నుంచి దూర ప్రాంతాలకు వెళ్లాలనుకునే ప్రయాణికులు ఓఆర్ఆర్ మీదుగా చర్లపల్లి చేరుకొని తమ గమ్యస్థానాలకు వెళ్లొచ్చు. మరోవైపు ఎంఎంటీఎస్ రైళ్ల (MMTS Trains)ను చర్లపల్లి టర్మినల్‌కు అనుసంధానించడంతో ప్రయాణికులు సాఫీగా రైల్వే స్టేషన్‌ను చేరుకోవచ్చు.