ManaEnadu:హైదరాబాద్లో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను (Govt Lands), చెరువులను పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. హైడ్రా కమిషనర్గా రంగనాథ్ బాధ్యతలు స్వీకరించిన మరుక్షణం నుంచి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణే ధ్యేయంగా రంగంలోకి దిగిన హైడ్రా (HYDRA).. ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది.
111.72 ఎకరాల భూమి స్వాధీనం
హైడ్రా ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు వంద ఎకరాలకుపైగా స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. వందల అక్రమ నిర్మాణాల (Illegal Constructions)ను కూల్చివేసింది. ఈ నేపథ్యంలో తాజాగా హైడ్రా రాష్ట్ర ప్రభుత్వానికి మోర నివేదిక అందజేయసింది. ఈ నివేదిక ప్రకారం జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తం 23 ప్రాంతాల్లో 262 అక్రమ నిర్మాణాలను కూల్చివేసి 111.72 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా తెలిపింది.
ఆక్రమణదారులకు హడల్
గత రెండు నెలలుగా చెరువులు, ఎఫ్‌టీఎల్ (FTL), బఫర్ జోన్ల (Buffer Zones)లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రా.. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలను ఎక్కడా ఉపేక్షించకుండా నేలమట్టం చేస్తూ ఆక్రమణదారులకు నిద్రలేకుండా చేస్తోంది. రాబోయే రోజుల్లో హైడ్రా చర్యలు మరింత వేగవంతం కానున్నాయి.
అత్యధికంగా అమీన్‌పూర్‌లో
ముఖ్యంగా నగరంలోని రామ్‌నగర్ మణెమ్మ గల్లీలో 3, గగన్ పహాడ్ అప్పా చెరువులో 14, అమీన్‌పూర్ పెద్ద చెరువు పరిధిలో 24, మాదాపూర్ సున్నం చెరువులో 42, దుండిగల్ కత్వా చెరువు పరిధిలో 13 అక్రమ నిర్మాణాలను తొలగించింది. అత్యధికంగా అమీన్‌పూర్‌లో 51 ఎకరాలు, మాదాపూర్ సున్నం చెరువు పరిధిలో 10 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రిపోర్టులో హైడ్రా (Hydra Latest Report) పేర్కొంది.