Independence Day: భారత్, పాకిస్థాన్‌లకు స్వాతంత్య్రం .. ఆగస్టు 15వ తేదీనే ఎందుకు?

ManaEnadu:1947 ఆగస్టు 14న అర్ధరాత్రి భారత్‌కు స్వాతంత్య్రం (Independence) వచ్చిందని అందరికీ తెలుసు. అప్పటి నుంచి ఆగస్టు 15న ఇండిపెండెన్స్‌ డేను చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. కానీ భారత దేశాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించడానికి బ్రిటిషర్లు ఆ తేదీనే ఎందుకు ఎంచుకున్నారు? పాకిస్థాన్, భారత్‌లకు ఒకే తేదీన స్వాతంత్య్రం ప్రకటించినప్పటికీ పాకిస్థాన్‌లో మాత్రం ఆగస్టు 14నే ఎందుకు, భారత్‌లో ఆగస్టు 15 నాడు ఎందుకు జరుపుకుంటారో తెలుసా? అయితే ఇప్పుడు తెలుసుకుందాం..

1946లో రెండో ప్రపంచ(Second World War) యుద్ధం ముగిసిన తర్వాత బ్రిటన్ ప్రభుత్వం కష్టాల్లో పడింది. భారత్‌పై నియంత్రణను కొనసాగించడానికి కావాల్సిన వనరులు లేవు. దాంతో 1948 జూన్ నాటికి భారత్‌కు పూర్తి స్వయం పాలనను మంజూరు చేస్తామని 1947 ఫిబ్రవరి 20న బ్రిటన్ ప్రధాని క్లెమెంట్ అట్లీ (Clement Attlee)ప్రకటించారు. అయితే అప్పటి వరకూ వేచి ఉండటం కష్టమని లార్డ్ మౌంట్ బాటన్ భావించారు. కాంగ్రెస్, ముస్లిం లీగ్ మధ్య ఘర్షణలు తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు దారి తీస్తాయని ఆయన భయపడ్డారు. పైగా 1948 జూన్ వరకు వేచి ఉంటే బదిలీ చేయడానికి అధికారాలేవీ ఉండవని భావించవచ్చు. అందువల్ల పరిస్థితులను అర్థం చేసుకున్న మౌంట్ బాటన్ భారత దేశ స్వాతంత్య్ర తేదీని 1947 ఆగస్టుకు మార్చారు.

జపాన్‌పై ఉన్న కోపంతోనే..

ఇక ఆగస్టులో 15వ తేదీనే ఎంచుకోవడానికీ కారణం ఉంది. ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ పుస్తకం ప్రకారం ఈ తేదీ మౌంట్ బాటన్‌కు వ్యతిరేకం. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ లొంగిపోయిన రెండో వార్షికోత్సవ తేదీని బాటన్ భారత స్వాతంత్య్ర తేదీగా ఎంచుకున్నాడు. ఆయన సిఫార్సుల ఆధారంగా 1947 జూలై 4న భారతదేశ బిల్లు బ్రిటిష్ ఇండిపెండెన్స్ ఆఫ్ కామర్స్‌ హౌజ్‌లో ఆమోదించబడింది. దీంతో ఆగస్టు 14 అర్ధరాత్రి సరిగ్గా 12 గంటలకు పాకిస్థాన్, భారత్‌కు స్వాతంత్య్రం వస్తుందని ప్రకటించింది. అయితే ఇస్లామాబాద్‌లోని నేషనల్ డాక్యుమెంటేషన్ సెంటర్లో లభించిన పత్రాల మేరకు 1948 జూన్ 29న పాక్ ప్రధాని నవాబ్ జాద్ లికాయత్ అలీఖాన్ నేతృత్వంలో జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఆగస్టు 14నే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు. గవర్నర్ జనరల్ జిన్నా దానికి ఆమోదం తెలిపారు.

ఆ భావన పాకిస్థాన్ ప్రజల్లో కల్పించారు..

దీని తర్వాత పాకిస్థాన్ వ్యాప్తంగా 1948లో ఆగస్టు 14న స్వాతంత్ర్య వేడుకలు జరుపుకున్నారు. ఇక ఆ తర్వాత కూడా ఆగస్టు 14నే పాక్‌లో స్వాతంత్ర్య వేడుకలు జరుపుకుంటూ వస్తున్నారు. దీంతో భారత్ కంటే ఒకరోజు ముందే పాకిస్థాన్‌కు స్వాతంత్ర్యం వచ్చిందన్న భావన అక్కడి ప్రజల్లో ఏర్పడింది. నిజానికి పాకిస్థాన్ క్యాబినెట్ తమ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తేదీని మార్చుకోలేదు. కానీ స్వాతంత్ర్య దినోత్సవాలు జరుపుకునే తేదీని మాత్రం ఆగస్టు 14 అని ప్రకటించింది. దానినే ఎందుకు మార్చిందనేదానికి సరైన కారణాలు లేవు. ఇదండీ ఇండియా, పాకిస్థాన్‌లకు స్వాతంత్య్రం వచ్చిన రోజు వెనుక ఉన్న హిస్టరీ..

 

Share post:

లేటెస్ట్