ManaEnadu:చంద్రుడిపై అన్వేషణలో భాగంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఇప్పటికే పలు ప్రయోగాలు చేపట్టి విజయవంతం అయిన విషయం తెలిసిందే. చంద్రయాన్-3 తో జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా చరిత్ర సృష్టించింది. ఇప్పుడు చంద్రుడిపై మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు మరిన్ని ప్రయోగాలు చేపడుతోంది. జాబిల్లిపై నుంచి రాళ్లు, మట్టి తీసుకువచ్చే లక్ష్యంతో అనేక ప్రయోగాలకు శ్రీకారం చుట్టబోతోంది.
ఇందులో భాగంగానే చంద్రయాన్-4, చంద్రయాన్-5 ప్రయోగాలు చేపట్టనున్నట్లు ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు. ఇటీవలే వీటి డిజైన్లు పూర్తయినట్లు వెల్లడించారు. దిల్లీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ప్రస్తుతం ఇవి ప్రభుత్వ ఆమోదం పొందే ప్రక్రియలో ఉన్నాయని చెప్పారు. రానున్న ఐదేళ్లలో ఇస్రో దాదాపు 70 ఉపగ్రహ ప్రయోగాలు చేపట్టనుందని ఆయన వివరించారు.
చంద్రుడిపై అన్వేషణ కోసం వరుస ప్రయోగాలు చేపడుతున్నామని సోమనాథ్ చెప్పారు. రానున్న కాలంలో ఇస్రో మొత్తంగా 70 శాటిలైట్ ప్రయోగాలు చేపట్టనుందని తెలిపారు. ఇందులో వివిధ శాఖల అవసరాల కోసం తక్కువ ఎత్తులో చేపట్టే నావిక్ (NAVIC) INSAT 4D, రిసోర్స్‌శాట్, కార్టోశాట్ వంటి ప్రయోగాలున్నాయని వెల్లడించారు. అయితే శుక్ర గ్రహం కోసం చేపట్టాల్సిన మిషన్‌ను తాత్కాలికంగా నిలిపివేశామని ప్రస్తుతం తమ ఫోకస్ అంతా చంద్రుడిపైనే ఉందని వివరించారు.
మరోవైపు మానవ రహిత గగన్‌యాన్ ప్రాజెక్టుకు సంబంధించి కీలక ప్రకటన చేశారు సోమనాథ్. ఈ ఏడాది డిసెంబరులో ఈ ప్రయోగం చేపట్టే అవకాశం ఉందని వెల్లడించారు. ఇందుకు సంబంధించి అన్ని విభాగాల రాకెట్లు శ్రీహరి కోటకు ఇప్పటికే చేరుకున్నాయని తెలిపారు. మరోవైపు చంద్రయాన్ 4 మిషన్ 2028లో చేపట్టే అవకాశం ఉన్నట్లు పునరుద్ఘాటించారు