Mana Enadu:అమెరికా అధ్యక్ష ఎన్నికలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే ప్రస్తుత అధ్యక్షుడు జై బైడెన్ పోటీ నుంచి తప్పుకోవడం.. ఇటీవలే మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం.. ఆ తర్వాత అధ్యక్ష బరిలో నుంచి బైడెన్ తప్పుకుని ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఎంట్రీ ఇవ్వడం.. ఇలా రోజుకో మలుపుతో అగ్రరాజ్యం రాజకీయం రంజుగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఉపాధ్యక్షురాలు, డెమోక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్ రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో డిబేట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సెప్టెంబర్ 4న ఫాక్స్ న్యూస్ ఛానెల్ ఆతిథ్యంలోడిబేట్‌లో పాల్గొందామని డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదన చేయగా.. దాన్ని కమలా హ్యారిస్ తిరస్కరించారు. ‘‘ఎప్పుడైనా.. ఎక్కడైనా సరే.. డిబేట్‌కు నేను రెడీ అంటూ గతంలో అన్న వ్యక్తి ఇప్పుడు నిర్దిష్ట తేదీన.. సురక్షిత ప్రాంతంలో డిబేట్‌కు ఆహ్వానిస్తూ ప్రతిపాదించడం విచిత్రంగా ఉందంటూ ట్రంప్‌ను ఉద్దేశించి కమలా హ్యారిస్ వ్యాఖ్యలు చేశారు. జో బైడెన్ డెమోక్రాట్ల అభ్యర్థిగా ఉన్నప్పుడు కుదిరిన అంగీకారం ప్రకారం సెప్టెంబరు 10న ఏబీసీ న్యూస్ ఆతిథ్యంలో డిబేట్ జరుపుదామని ఆమె తేల్చి చెప్పారు. ట్రంప్ కొత్త ప్రతిపాదన తనకు అంగీకారం కాదని.. సెప్టెంబరు 10న డిబేట్‌లో పాల్గొనేందుకు ట్రంప్ ముందుగా అంగీకరించినట్లు తాను అదే తేదీన వస్తానని హ్యారిస్ ఎక్స్ వేదికగా స్పష్టం చేశఆరు.
ఇత జూన్‌లోనే సీఎన్‌ఎన్ ఆతిథ్యంలో బైడెన్‌తో కలిసి ట్రంప్ డిబేట్‌లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ సమయంలోనే సెప్టెంబరు 10న ఏబీసీ న్యూస్ నిర్వహణలో రెండో డిబేట్ ఉంటుందని చెప్పారు. అయితే అనూహ్య పరిస్థితుల్లో బైడెన్ స్థానంలో డెమోక్రాట్ల అభ్యర్థిగా హారిస్ తెరమీదకు రావడంతో.. సెప్టెంబరు 4న ఫాక్స్ న్యూస్ ఛానెల్ నిర్వహణలో డిబేట్‌లో పాల్గొందామని ట్రంప్ తాజాగా ప్రతిపాదించి తిరస్కరణకు గురయ్యారు.
మరోవైపు అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న కమలా హ్యారిస్ మంగళవారంలోగాఉపాధ్యక్ష అభ్యర్థిని ఎంచుకోవాల్సి ఉంది. ఆరుగురు కీలక వ్యక్తులతో (నలుగురు గవర్నర్లు, ఓ సెనెటర్, ఓ కేబినెట్ అధికారి) కూడిన జాబితాలోనుంచి హారిస్ తన నంబర్-2ను ఎంచుకోనున్నారు.