ManaEnadu:వినాయక చవితి (Vinayaka Chaviti) వచ్చేస్తోంది. ఈనెల 7వ తేదీన గణపయ్య మన ఇళ్లలో అడుగుపెట్టబోతున్నాడు. గణేశ్ చతుర్థి వచ్చిందంటే చాలు తెలంగాణలో సందడే సందడి. ముఖ్యంగా హైదరాబాద్‌లో వారం ముందు నుంచే గణేశ్ విగ్రహాల దుకాణాలు కిటకిటలాడుతుంటాయి. వీధివీధిన గణేశ్ మండపాలను తీర్చిదిద్దే పనిలో నిర్వాహకులు బిజీబిజీగా ఉంటారు. మరి వినాయకుడి విగ్రహాన్ని (Ganesh Idol) ఇంటికి తీసుకొచ్చే ముందు మీరు కొన్ని విషయాలు తప్పక తెలుసుకోవాలి. మరి ఆ విషయాలేంటో ఓసారి చూద్దామా?
సాధారణంగా గణేశ్ విగ్రహం తీసుకువచ్చే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అంతా శుభమే కలుగుతుంది. ముఖ్యంగా విగ్రహం ఎంపిక చేసేటప్పుడు చాలా నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఏవైపు తొండం (Ganesh Trunk) ఉన్న విగ్రహం తీసుకోవాలి? గణేశ్ ప్రతిమ ఎత్తు ఎంత ఉండాలి? ఎలాంటి రంగు విగ్రహాన్ని ఎంచుకోవాలి? ఎలాంటి ఆకారంలో ఉండాలి? ఎలాంటి రంగు విగ్రహాలను అస్సలు ప్రతిష్టించకూడదనేది ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయాలు.
లంబోదరుడి తొండం ఏవైపు ఉండాలి?
ఇంట్లో అయినా మండపాల్లో అయినా ప్రతిష్ఠించే వినాయకుడి విగ్రహ తొండం ఆ గణపయ్య ఎడమ వైపునకు వంగి ఉండాలని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి విగ్రహాన్ని పూజిస్తే ఆర్థిక సమస్యలు తొలగి ధన లాభం చేకూరుతుందని అంటున్నారు. గణపతి (Lord Ganapati)ని ఏదైనా ఆసనం లేదా ఎలుకపై కూర్చున్నట్లుగా ఉన్న ప్రతిమను తీసుకుంటే ఇంకా మంచిదని తెలిపారు. నిలుచున్న భంగిమలో ఉన్న విగ్రహాన్ని తీసుకోకపోవడమే శ్రేయస్కరమని సూచించారు
ఏ రంగు వినాయకుడి విగ్రహం శుభం?
మరోవైపు లంబోదరుడి విగ్రహం కొనుగోలు చేసేటప్పుడు రసాయనాలు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (Plaster Of Paris) వంటి విగ్రహాలు కాకుండా సరళమైన రంగులున్న, నీటిలో సులువుగా కరిగిపోయే మట్టి విగ్రహాలు (Clay Ganesh Idols) తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. దీనివల్ల పర్యావరణానికి మేలు జరగడమే కాకుండా గణపయ్య కూడా సంతోషిస్తాడని చెబుతున్నారు. ముఖ్యంగా నలుపు రంగు ఉన్న విగ్రహాన్ని తీసుకోకూడదని తెలిపారు. విగ్రహం చిన్నదైనా, పెద్దదైనా భక్రి శ్రద్ధలతో గణపయ్యకు పూజలు చేస్తే ఆ లంబోదరుడి కటాక్షం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.