ManaEnadu: ప్రపంచాన్ని కరోనా మహమ్మారి(Covid-19) ఎంతలా వణికించిందో ప్రతి ఒక్కరికీ తెలుసు. కొవిడ్ సృష్టించిన ప్రళయం అంతాఇంతా కాదు. జనం పిట్టల్లా రాలిపోయారు. ఈ మహమ్మారి బారిన పడినవారిని కనీసం ఇంట్లో వారు కూడా ప్రత్యక్షంగా తాకలేకపోయిన పరిస్థితులు తలెత్తాయి. దాదాపు రెండేళ్ల పాటు తన మనుగడను కొనసాగించిందీ వైరస్. కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 70 లక్షల(70 Lakshs) మందికి పైగానే ప్రాణాలు కోల్పోయారని పలు సర్వేలు వెల్లడించాయి. అటు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య దాదాపు 50 కోట్లకు పైగానే ఉందని తేలింది. అయితే ఈ మహమ్మారి కోరల్లో నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. అయితే కొవిడ్ కారణంగా చాలా రంగాలు తీవ్రంగా నష్టపోయాయి. ముఖ్యంగా పర్యాటక(Tourist), రియల్ ఎస్టేట్(Real Estate) రంగాలు కుదేలయ్యాయి. ఇప్పుడిప్పుడే కొన్ని దేశాలు తమ కంట్రీలోకి ఇతర దేశాల వారికి ఎంట్రీ కల్పిస్తుండగా.. రియల్ ఎస్టేట్ రంగం కూడా క్రమంగా ఊపందుకుంటోంది.
పెరుగుతోన్న భూములు, ఇళ్ల ధరలు
కొవిడ్(Covid) తర్వాతి కాలంలో రియల్ ఎస్టేట్‌కు ఊహించని స్థాయిలో డిమాండ్ పెరిగిందని చెప్పొచ్చు. ఎక్కడ చూసినా భూములు, ఇళ్ల ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇదే స్థాయిలో అద్దెలు(Rents) కూడా ఎక్కువ కట్టాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే గత నాలుగేళ్లలో దేశంలో రియల్ ఎస్టేట్ మార్కెట్(Markets)పై విశ్లేషించింది ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కంపెనీ మ్యాజిక్‌బ్రిక్స్. ఇళ్ల ధరల పెరుగుదలకు సంబంధించి ఒక నివేదిక(Report) విడుదల చేసింది. ఈ నాలుగు సంవత్సరాల్లో హైదరాబాద్(Hyderabad) నగరంలోనే ఇళ్ల ధరలు ఏకంగా 80% వరకు పెరిగాయని తెలిపింది. దేశం మొత్తం మీద చూస్తే.. స్థిరాస్తి ధరల్లో ఎక్కువ పెరుగుదల హైదరాబాద్‌లోనే నమోదైందని మ్యాజిక్‌బ్రిక్స్(Magicbricks) పేర్కొంది. దేశంలోని 10 ముఖ్య నగరాల్లో ఇళ్ల ధరలకు సంబంధించి ఈ సంస్థ విశ్లేషించి నివేదిక రూపొందించింది.
ఆ నగరాల్లో అందుబాటులోనే..
ఇళ్ల ధరలు అనూహ్య రీతిలో పెరిగినప్పటికీ అదే స్థాయిలో ప్రజల ఆదాయాలు(Income) పెరగకపోవడంతో ఇళ్లు కొనుగోలు చేసేందుకు తీసుకొచ్చిన రుణాలకు మాత్రం నెలవారీ EMIల భారం ఎక్కువ అవుతుందని పేర్కొంది. ఈ 4 ఏళ్లలో అంటే 2020-24 మధ్య దేశంలోని 10 నగరాల్లో ప్రజల ఆదాయాల్లో వృద్ధి 5.4 శాతంగానే ఉండగా.. ఇదే సమయంలో ఇళ్ల ధరలు 9.3 శాతం మాత్రం పెరిగాయి. దీనితోనే ప్రజల ఇళ్ల కొనుగోలు శక్తి తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాలన్నింటిలో హైదరాబాద్‌లో అత్యధికంగా 80 శాతం ఇళ్ల ధరలు పెరిగాయి. ముంబై(Mumbai), దేశ రాజధాని ఢిల్లీ(Delhi) వంటి నగరాల్లో ఇళ్ల ధరలు.. మధ్య తరగతి వర్గం వారు భరించేలని స్థాయిలో ఉండగా.. చెన్నై, అహ్మదాబాద్(Ahmedabad) సహా కోల్‌కతా(Kolkata) వంటి మెట్రో నగరాల్లో కొంత అందుబాటు ధరల్లోనే లభిస్తున్నాయి. 2020లో దేశంలో నెలవారీ ఆదాయం నుంచి ఇంటి లోన్ కోసం చెల్లిస్తున్న EMI వాటా 46 శాతంగా ఉండగా.. ఇప్పుడు అది 61 శాతానికి పెరిగింది. అంటే.. నెల జీతంలో 61 శాతం వరకు ఈఎంఐలకే పోతుందంట. ఈ లెక్కన ఇళ్ల కొనుగోలుదారులపై ఈఎంఐ భారం పెరిగిందన్నమాట. కోల్‌కతాలో ఇది 47 శాతంగా, అహ్మదాబాద్, చెన్నై వంటి చోట్ల 41 శాతంగా ఉందని తాజా నివేదికలో తేలింది.