ManaEnadu:టాలీవుడ్ నటుడు మంచు విష్ణు టైటిల్ రోల్లో నటిస్తున్న సినిమా కన్నప్ప. పాన్ ఇండియా చిత్రంగా రాబోతున్న ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మోహన్ బాబు, మోహన్ లాల్, నయనతార, శివరాజ్ కుమార్, మధుబాల, శరత్ కుమార్, అక్షయ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే పలువురు పాత్రలకు సంబంధించిన లుక్స్, కన్నప్ప గ్లింప్స్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే.
ఇక ఈ సినిమాకు సంబంధించి తరచూ ఓ అప్డేట్ను షేర్ చేస్తున్నాడు మంచు విష్ణు. తాజాగా శ్రీకృష్ణాష్టమి నేపథ్యంలో సోమవారం రోజున కన్నప్ప నుంచి ఓ క్రేజీ అప్డేట్ రాబోతోందంటూ ప్రీ అప్డేట్ ఇచ్చాడు. ఈ సినిమాలో మంచు విష్ణు కుమారు అవ్రామ్ భక్త మంచు కూడా నటించబోతున్నాడట. కన్నప్ప అవ్రామ్కు డెబ్యూ సినిమా కాబోతోంది. అయితే అవ్రామ్ ఇందులో ఏ పాత్రలో కనిపించబోతున్నాడనేది మాత్రం సస్పెన్స్. ప్రస్తుతానికి ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు..
ఇక ఈ సినిమాలో హీరోయిన్గా ప్రీతి ముకుందన్ నటిస్తోంది. ఈ చిత్రాన్ని మంచు విష్ణు సొంత బ్యానర్ Ava ఎంటర్‌టైన్మెంట్‌తో పాటు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ఈ సినిమాకు స్టీఫెన్ డేవస్సీ, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయిమాధవ్, తోట ప్రసాద్ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబర్లో విడుదల కానున్నట్లు సమాచారం.
కన్నప్ప స్టోరీ ఇదే..
‘మహాకవి ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యంలోని భక్తకన్నప్ప చరిత్రను ఆదర్శంగా తీసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు గతంలో మంచు విష్ణు చెప్పారు. కన్నప్ప వృత్తాంతం 2వ శతాబ్దంలో జరిగిందని తెలిపారు. కన్నప్ప భక్తిని, ఆయన గొప్పతనాన్నీ నేటి తరానికి తెలియజేయాలనే సంకల్పంతోనే ఈ చిత్రాన్ని పాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతోనే ఈ సినిమాను సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు.