ManaEnadu:టాలీవుడ్ యంగ్ హీరో.. మెగా కాంపౌండ్ నుంచి, అల్లు ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో నటుడు అల్లు శిరీష్. గౌరవం సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ నటుడు.. వరుస సినిమాలు చేస్తూ ముందుకెళ్తున్నాడు. కానీ తన సోదరుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు వచ్చినంత పాపులారిటీ మాత్రం రావడం లేదు. 2022లో ఊర్వశివో రాక్షసివో సినిమాతో హిట్ కొట్టాడు శిరీష్. దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ తాజాగా బడ్డీ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
శామ్ ఆంటోన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శిరీష్‌కు జంటగా గాయత్రీ భరద్వాజ్ నటించింది. అజ్మల్, ప్రీషా రాజేశ్ ప్రధాన పాత్రల్లో నటించారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు ఫస్ట్ వీక్‌లో థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాను తమిళంలో రిలీజ్ అయిన టెడ్డీ మూవీకి రీమేక్‌గా తెరకెక్కించారు. దీంతో థియేటర్లలో ఈ మూవీ మిశ్రమ స్పందన అందుకుంది.
అయితే నెల కూడా తిరగకుండానే ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయింది. అల్లు శిరీష్ నటించిన బడ్డీ మూవీ త్వరలోనే ఓటీటీలోకి రాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఆగస్టు 30వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తుందని సదరు సంస్థ వెల్లడించింది. ఇక ఈ చిత్రం ఓటీటీలో తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపింది. నెక్స్ట్ వీకెండ్‌ను జాలీగా టెడ్డీ-ఆదిల ఫ్రెండిషిప్ చూస్తూ ఎంజాయ్ చేయండి అంటూ నెట్‌ఫ్లిక్స్ పోస్టు చేసింది.
‘బడ్డీ’ స్టోరీ ఇదే…
ఆదిత్య (అల్లు శిరీష్) పైలెట్. విధి నిర్వహణలో భాగంగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌తో తరచూ మాట్లాడుతుండగా.. అక్కడ పని చేసే పల్లవి (గాయత్రీ భరద్వాజ్)తో పరిచయం పెరుగుతుంది. వాళ్లిద్దరూ చూసుకోకున్నా.. ఆ మాటల పరిచయం ప్రేమగా మారుతుంది. అయితే కొన్నాళ్ల తర్వాత ఆదిత్యకు తనని పరిచయం చేసుకుని మనసులో మాట చెప్పాలనుకుంటుంది పల్లవి. కానీ, ఓ రోజు ఆమె చేసిన చిన్న పొరపాటుతో ఆదిత్యను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయడంతో డైరెక్టుగా అతణ్ని కలిసి సారీ చెప్పాలనకుంటుంది. కానీ ఇంతలోనే ఆమెను కిడ్నాప్ చేస్తారు. ఈ క్రమంలో జరిగిన గొడవలో గాయపడి ఆమె కోమాలోకి వెళ్తుంది. అయితే ఆమె మాత్రం ఓ టెడ్డీబేర్లోకి చేరుతుంది. కోమాలో ఉన్న పల్లవి ఆత్మ బయటకెలా వచ్చింది? ఆమెను కిడ్నాప్ చేసిన ముఠాతో.. హాంకాంగ్‌లో ఉన్న డాక్టర్ అర్జున్ కుమార్ వర్మ (అజ్మల్)కూ ఉన్న సంబంధం ఏంటి? పల్లవిని ఆదిత్య ఎలా కాపాడాడు? అన్నదే ఈ స్టోరీ. మరి ఈ సినిమాను ఈ వీకెండ్‌కు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.