AP:బీటెక్ కాలేజీ వాష్​రూమ్​లో హిడెన్ కెమెరాలు.. 300 మందిని రహస్యంగా రికార్డు చేసి..!


ManaEnadu:అమ్మ కడుపులో నుంచి బయటపడిన క్షణం నుంచి ఆడపిల్లలకు రక్షణ (Women Safety) లేకుండా పోతోంది. ఇంటా బయటా కీచకులు ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడేందుకు కాచుకు కూర్చున్నారు. వారి బారి నుంచి అమ్మాయులకు రక్షణ కరువైపోతోంది. చదువుకునే చోట తోటి విద్యార్థులతోనూ పెను ముప్పు కలుగుతోంది.

ఎటు నుంచి ఏ ముప్పు పొంచుందో?

ప్రమాదం ఏవైపు నుంచి వస్తుందోనని అమ్మాయిలను బయటకు పంపేందుకు తల్లిదండ్రులు భయపడుతున్నారు. వేధింపులు, బెదిరింపులు, అత్యాచారాలు, హత్యలు ఆడవారిపై నిత్యకృత్యమైన ఈ దారుణాలతో అమ్మాయిలను కన్న వారికి కంటిమీద కునుకు లేకుండా పోతోంది. ఇక తాజాగా తమ బిడ్డలను చదువుకునేందుకు కాలేజీకి పంపిస్తే అక్కడ కొందరు ఆకతాయిలు ఏకంగా బాత్​రూమ్​లో రహస్య కెమెరాలు (Hidden Cameras) పెట్టిన ఉదంతం చోటుచేసుకుంది.ఈ సంఘటన ఏపీలోని కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఇంజినీరింగ్ కాలేజీలో జరిగింది.

వాష్​రూమ్​లో హిడెన్ కెమెరాలు..

గుడ్లవల్లేరులోని ఇంజినీరింగ్‌ కళాశాల (Gudlavalleru Engineering College)లో గురువారం అర్ధరాత్రి దాటాక విద్యార్థినులు ఆందోళనకు దిగారు. బాలికల హాస్టల్‌ వాష్‌ రూమ్‌లో సీక్రెట్‌ కెమెరాలు పెట్టారని వారు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. బాత్​రూమ్​లో సీసీకెమెరాలు పెట్టి వీడియోలు తీసి వాటిని కాలేజీలోని అబ్బాయిలకు విక్రయిస్తున్నాడంటూ బీటెక్‌ విద్యార్థి (B.Tech Student)పై సహచర విద్యార్థుల దాడి చేశారు. తెల్లవారుజామున 3.30 గంటల వరకు ఈ హైడ్రామా కొనసాగింది.

300 మంది అమ్మాయిల వీడియోలు..

విషయం తెలుసుకుని పోలీసులు కళాశాల హాస్టల్‌(College Hostel) కు చేరుకుని వారిని ఆపారు. అనంతరం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థి విజయ్‌ని ప్రశ్నించి అతడి ల్యాప్‌ట్యాప్‌, సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకుని అందులో డేటాను పరిశీలించారు. అందులో ఉన్న డేటా చూసి పోలీసులు షాక్ అయ్యారు. దాదాపు 300 మంది అమ్మాయిలకు సంబంధించి ప్రైవేట్ వీడియోలు (Private Videos) ఉన్నట్లు సమాచారం. కెమెరా ఏర్పాటులో విజయ్‌కు మరో విద్యార్థిని సహకరిస్తోందంటూ పలువురు ఆరోపించారు.

తల్లిదండ్రుల ఆందోళన

బాలికల హాస్టళ్లలో హిడెన్‌ కెమెరా గుర్తించారంటూ ‘ఎక్స్‌’ వేదికగా విద్యార్థుల పోస్టులు పెట్టారు. ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద రచ్చ నడుస్తోంది. వారం క్రితమే ఘటన వెలుగు చూసినా యాజమాన్యం పట్టించుకోవడంలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అమ్మాయిలను కళాశాలలకు ఎలా పంపించాలంటూ విద్యార్థినుల తల్లిదండ్రులు వాపోతున్నారు. చదువుకునే చోట కూడా ఇలాంటి ఘటనలు తప్పడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

 

Share post:

లేటెస్ట్