ManaEnadu:”ఆగస్టు 2న ఏం జరిగిందో గుర్తుంది కదా. అదేనండి ఆరోజున ఉదయం రాంబాబు తన కుటుంబంతో కలిసి విజయనగరం సాయిబాబా గుడికి వెళ్లాడు. అప్పటికే అక్కడ ప్రవచనాలు మొదలయ్యాయి. రాత్రి హోటల్లో బస చేసి ఆగస్టు 3 పొద్దున్న రేసుగుర్రం సినిమా చూసి పెద్ద హోటల్లో బిర్యానీ తిని సాయంత్రం 5:00కి ఆర్టీసీ బస్సెక్కి వర్షంలో తడిసి ఇంటికి చేరారు. జలుబు, జ్వరం రావడం వల్ల పిల్లలు రెండు రోజులు స్కూలుకి వెళ్లలేదు.” ఇదంతా మీకు గుర్తింది కదా.
ఇది వింటుంటే ఏదో సినిమాలో చూసినట్టు అనిపిస్తోంది కదా. ఏదో సినిమానో కాదండోయ్. దృశ్యం చిత్రం. ఈ సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. మలయాళంలో రిలీజ్ అయిన ఈ చిత్రాన్ని ఆ తర్వాత తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో రీమేక్ చేస్తే అంతే ఆదరణ దక్కింది. ఇప్పటికే ఈ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కింది. ఇప్పుడు మూడో పార్ట్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్ జీతూ జోసెఫ్ ‘దృశ్యం3’పై ఓ మంచి అప్డేట్ ఇచ్చారు.
చిత్రమ్మ ఐడియా ఇచ్చింది..
దృశ్యం-3 కోసం కథను రెడీ చేస్తున్నట్లు జీతూ చెప్పారు. ‘దృశ్యం’ తర్వాత పార్ట్- 2 కోసం ప్లాన్ చేయలేదని.. అందుకే ఆ సినిమా రిలీజ్‌కు చాలా సమయం పట్టిందని తెలిపారు. సెకండ్ పార్ట్ సమయంలో ఎదురైన సమస్యలు పార్ట్-3కి రాకూడదని జాగ్రత్త పడుతున్నట్లు చెప్పారు. అయితే పార్ట్-3లో సినిమాకు ఎలాంటి ముగింపు ఇవ్వాలో తనకు ఓ ఐడియా ఉందని.. క్లైమాక్స్‌ను ఇప్పటికే రెడీ చేసుకున్నట్లు వెల్లడించారు. అయితే మొదలు ఎక్కడి నుంచి పెట్టాలో మాత్రం అర్థం కావడం లేదని అన్నారు. అయితే ఇటీవల ఓ ప్రోగ్రామ్‌లో గాయని చిత్రమ్మను కలిసినప్పుడు దృశ్యం గురించి చర్చ వచ్చిందని జీతు చెప్పుకొచ్చారు. ఆ సమయంలో చిత్ర.. ఓ అద్భుతమైన ఐడియా చెప్పారని.. అప్పుడు తనకు పార్ట్-3ని ఎలా మొదలు పెట్టాలో క్లారిటీ వచ్చిందని తెలిపారు. ఇక క్లైమాక్స్ గురించి మోహన్‌లాల్‌కు చెప్పగా తనకు బాగా నచ్చిందని ఆయన అన్నారని జీతూ చెప్పుకొచ్చారు.
ఎన్ని భాషల్లో రీమేక్ అంటే..?
‘దృశ్యం’ సినిమాను జీతూ జోసెఫ్ మొదట మోహన్‌లాల్, మీనా ప్రధాన పాత్రల్లో మలయాళంలో తెరకెక్కించగా అదే పేరుతో తెలుగులో వెంకటేశ్, మీనాతో రీమేక్ అయింది. అయితే దృశ్యం మూవీని తెలుగులో శ్రీప్రియ తెరకెక్కించగా.. పార్ట్-2ను మాత్రం జీతూ జోసెఫ్ రూపొందించాడు. హిందీలో అజయ్ దేవ్‌గణ్, శ్రియ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ రెండు సినిమాలను వేర్వేరు దర్శకులు డైరెక్ట్ చేశారు. తమిళ్ విషయానికొస్తే.. కమల్ హాసన్, గౌతమి ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక హాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని ఇంగ్లిష్, స్పానిష్‌లలో రీమేక్ చేసింది.