Nampally Court Judge: నాంపల్లి ఎక్సైజ్ ప్రత్యేక జేఎఫ్‌సీఎం న్యాయమూర్తి ఎ.మణికంఠ(36) భార్యతో గొడవలతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని కుటుంబం బాగ్ అంబర్‌పేటలోని పోచమ్మబస్తీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు.
మహబూబ్‌నగర్ జిల్లా అమిస్తాపూర్‌కు చెందిన లావణ్యతో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి విశ్వనాథ్ (5) అనే కుమారుడు ఉన్నాడు. అంబర్ పేట ఇన్ స్పెక్టర్ అశోక్ కేసు నమోదు చేసుకున్నారు.
మణికంఠ, అతని భార్య మధ్య కొంతకాలంగా కుటుంబ కలహాలు జరుగుతున్నాయని అంబర్ పేట ఇన్ స్పెక్టర్ అశోక్ తెలిపారు. కొద్ది రోజుల క్రితం లావణ్య కొడుకుతో కలిసి పుట్టింటికి వెళ్లింది. ఇటీవల మణికంఠ తల్లికి ఆరోగ్యం బాగోకపోవడంతో ఆస్పత్రిలో చేరారు. మణికంఠ తండ్రి తన భార్యను చూసుకుంటూ ఆసుపత్రిలో ఉన్నాడు. ఓ వైపు తల్లి ఆరోగ్య పరిస్థితి విషమించి ఆస్పత్రిలో ఉండగానే మరోవైపు భార్య కొడుకుతో కలిసి పుట్టింటికి వెళ్లడంతో మనకంఠ మనోవేదనకు గురయ్యాడు. ఆదివారం భార్యకు ఫోన్ చేయగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన మణికంఠ తాను బతకలేనని, ఆత్మహత్య చేసుకుంటానని భార్యకు ఫోన్‌లో చెప్పాడు.