ManaEnadu:ఉత్తర్‌ప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రాన్ని తోడేళ్లు వణికిస్తున్నాయి. ముఖ్యంగా బహరయిచ్ జిల్లాలో తోడేళ్ల దాడులు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సుమారు 50 గ్రామాల ప్రజలు తోడేళ్ల వల్ల క్షణక్షం భయంతో బతుకుతున్నారు. అయితే ఇలా తోడేళ్లు వరుస దాడులకు పాల్పడటం అనేది సాధారణంగా జరగదని ‘ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్’ చీఫ్ ఎస్పీ యాదవ్ అన్నారు. అయితే అవి రేబిస్ (Rabies) వ్యాధికి గురై ఉంటాయని అనుమానం వ్యక్తం చేసిన అది కాకపోతే కెనైన్ డిస్టెంపర్ వైరస్ సోకడం వల్ల ఇలా దాడులకు తెగబడుతూ ఉండొచ్చని తెలిపారు.
తోడేళ్ల వరుస దాడులు అసాధారణం
“తోడేళ్లు (Wolf Attacks in UP) వరుసగా ప్రజలపై దాడులకు తెగబడటం అనే అసాధారణంగా జరుగుతుంది. గత పదేళ్లలో ఇలాంటి ఘటనలు జరగడం ఇదే తొలిసారి. అయితే తోడేళ్లు అలా ప్రవర్తించడానికి అవి రేబిస్ వ్యాధికి గురవడమైనా కావచ్చు లేదా కెనైన్ డిస్టెంపర్ వైరస్ బారిన పడైనా ఉండొచ్చు. ఇది గుర్తించేందుకు అటవీ శాఖ సర్వే చేస్తోంది. జంతువులు నమూనాల సమగ్ర విశ్లేషణ ద్వారా మాత్రమే దీనికి సరైన కారణాలు తెలుసుకోవచ్చు.
తోడేళ్ల దాడులకు అదే కారణం?
అయితే రేబిస్, కెనైన్ వంటి వైరస్లు ఒక్కోసారి జంతువుల ప్రవర్తనను మారుస్తాయి. అందుకే అవి మనుషులంటే భయాన్ని కోల్పోయి విచక్షణారహితంగా ప్రవర్తిస్తాయి. ఇప్పుడు దాడులకు తెగబడుతున్న తోడేళ్ల విషయంలోనే ఇదీ ఓ కారణమై ఉండొచ్చు.” అని ఎస్పీ యాదవ్ వివరించారు.
తోడేళ్ల దాడులో 8 మంది మృతి
ఇక బహరయిచ్ జిల్లా(Bahraich Wolf Attacks)లో ఇటీవల జరిగిన తోడేళ్ల దాడుల్లో ఎనిమిది మంది మరణించగా 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆరు తోడేళ్ల గుంపు ఈ జిల్లాల్లో సంచరిస్తూ దాడులు చేస్తోందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఆపరేషన్ భేడియాలో భాగంగా ఇప్పటి వరకు ఐదు తోడేళ్లను బంధించినట్లు తెలిపారు.