Mana Enadu: ఈమధ్య కాలంలో సిప్ రూపంలో పెట్టుబడులు(Investments) పెట్టేందుకు మదుపర్లు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ప్రతి నెలా కొద్ది మొత్తంలో పెట్టుబడి పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో మంచి రాబడులు వస్తాయని ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. అయితే మ్యూచువల్ ఫండ్(Mutual Funds)లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(SIP)తో పాటు సిస్టమాటిక్ విత్ డ్రాయల్ ప్లాన్(SWP) కూడా అందుబాటులో ఉంది. ఇంతకీ ఈ SWP ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం.
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టి
సిప్ రూపంలో కొందరు ప్రతినెలా పెట్టుబడులు పెడుతుంటారు. దీంతో కొన్ని సంవత్సరాల తర్వాత పెద్ద మొత్తంలో సొమ్ము వారి సొంతమవుతుంది. అయితే SWP అన్నది దీనికి పూర్తిగా వ్యతిరేకం. ఎందుకంటే.. ఇందులో ఇన్వెస్టర్ల పెట్టుబడిని క్రమానుగతంగా వెనక్కి తీసుకువాల్సి ఉంటుంది. ఈ SWP ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టి, అందులో నుంచి నెలనెలా నిర్దిష్ట మొత్తంలో నగదును ఉపసంహరించుకోవచ్చు. మీ ఆదాయ(Income) అవసరాలకు ఉపయోగపడే డబ్బును అందించే ఈ పథకం.. సీనియర్ సిటిజన్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ పథకంలో భాగంగా మీరు ఎన్నిరోజులకు ఒకసారి ఆదాయం రావాలనుకుంటున్నారో.. అప్పుడే మీ ఖాతాలో డబ్బు జమవుతుంది. కావాలనుకుంటే మీ ఖాతాలో జమయ్యే నిర్దిష్ట మొత్తాన్ని పెంచుకునే వెసులుబాటు కూడా ఉంటుంది.
రెండూ కలిసి ఉంటాయి..
సాధారణంగా ఇవి రెండు వేరువేరు ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్(Investment Plans). కానీ, ఈ రెండు బెనిఫిట్స్‌ని ఒకే స్కీమ్ ద్వారా అందించేందుకు కొన్ని కంపెనీలు ముందుకొస్తున్నాయి. ఇటీవల ఐసీఐసీఐ బ్యాంక్(Icici Bank) ‘ఫ్రీడమ్ సిప్’(Freedom Sip) పేరుతో కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇందులో SIP, SWP రెండూ కలిసి ఉంటాయి. ఇందులో ఇన్వెస్ట్ చేసేందుకు ఒక నిర్దిష్ట కాలవ్యవధిని ఎంచుకోవాలి. 8 ఏళ్లు, 10 ఏళ్లు, 12 ఏళ్లు, 15 ఏళ్లు.. ఇలా మీకు నచ్చిన టెన్యూర్‌ను ఎంపిక చేసుకోవాలి. కాలక్రమేణా పొదుపును పెంచుతూ పోవాలి. క్రమశిక్షణగా డబ్బు పొదుపు చేస్తూనే ఉండాలి. ఇలా చేస్తే దీర్ఘకాలంలో మనం ఊహించని పెట్టుబడులు రావొచ్చు. అయితే టెన్యూర్ సమయం పూర్తయ్యాక ఎన్నిరోజులకు ఒకసారి ఆదాయం రావాలి? మన ఖాతాలో ఒకేసారి ఎంత మొత్తంలో జమవ్వాలి? వంటి నిర్ణయాలను మనమే తీసుకోవాలి. అప్పటి వరకు ఇన్వెస్ట్ చేస్తూనే ఉండాలి. సిప్‌లో ఒకేసారి పెద్ద మొత్తంలో సొమ్ము మన చేతికందుతుంది. కానీ ఇందులో కొద్దికొద్దిగా ఆదాయం వస్తుంది. మీకు ఇచ్చే సొమ్ములో మిగిలిన మొత్తాన్ని ఫండ్ మేనేజర్లు ఇతర స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇలా మీ డబ్బులపై మళ్లీ రాబడి వస్తుంటుంది. దీంతో మీకు డబుల్ బెనిఫిట్ కలుగుతుంది.