ManaEnadu:హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ఇటీవలే షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఫొగాట్ ఫ్యామిలీ నుంచి ఇద్దరు సిస్టర్స్ బరిలోకి దిగనున్నట్లు సమాచారం. ఇటీవలే పారిస్ ఒలింపిక్స్ లో అనర్హత వేటుకు గురై భారత్ చేరుకున్న స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తూ రాజకీయ అరంగేట్రం చేయనున్నట్లు సమాచారం. ఆమెతో తన సోదరి బబితా ఫొగాట్‌పై పోటీ చేయించేందుకు పలు పార్టీలు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.
అయితే రాజకీయాల్లోకి రాబోనని గతంలో వినేశ్ తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోవాలని సర్దిచెప్పే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. ఫొగాట్ కుటుంబానికి అత్యంత సన్నిహిత వర్గాలు మీడియాతో మాట్లాడుతూ.. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో వినేశ్ వర్సెస్ బబితా ఫొగాట్ పోటీ ఉండొచ్చని తెలిపినట్లు సమాచారం. రాజకీయాల్లోకి రాబోనని గతంలో వినేశ్ ప్రకటించినా.. ఆమె తన నిర్ణయం మార్చుకునే పరిస్థితులు రావొచ్చని తెలిపారు. ఇప్పటికే కొన్ని రాజకీయ పార్టీలు ఆమెను సంప్రదించి సర్దిచెప్పే ప్రయత్నాలు చేస్తున్నాయని.. ఏ పార్టీలో చేరనున్నారనేది మాత్రం ప్రస్తుతానికి స్పష్టత లేదని మీడియాకు వెల్లడించినట్లు తెలిసింది.
అయితే పారిస్ ఒలింపిక్స్ నుంచి ఇటీవల వినేశ్ ఫొగాట్ స్వదేశానికి చేరుకున్న సమయంలో ఎయిర్‌పోర్టు వద్ద కాంగ్రెస్ ఎంపీ దీపిందర్ హుడా ఆమెను సాదరంగా స్వాగతం పలికిన విషయం తెలిసిందే. ఊరేగింపులో కూడా పాల్గొన్న ఆయన.. గతంలోనూ వినేశ్‌ను రాజ్యసభకు పంపాలని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే ఆమె కాంగ్రెస్‌లో చేరొచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.
ఇక వినేశ్ సోదరి బబితా ఫొగాట్ 2019లో బీజేపీ చేరి దాద్రి స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే త్వరలో జరగబోయే ఎన్నికల్లో మరోసారి ఆమెకు కమలం పార్టీ టికెట్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఒకవేళ అదే నిజమైతే.. ఈసారి హర్యానా ఎన్నికల్లో వినేశ్ (కాంగ్రెస్ (ఊహాగానాలు నిజమైతే)), బబిత బీజేపీ నుంచి పోటీ చేస్తే.. ఫొగాట్ సిస్టర్స్ మధ్య పోరు అందరినీ ఆకర్షించే అవకాశం ఉంది. హర్యానాలో అక్టోబరు 1వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.