Mana Enadu:పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఆరో పతకాన్ని అందించాడు రెజ్లర్ అమన్ సెహ్రావత్. 21 ఏళ్ల అండర్-23 ప్రపంచ ఛాంపియన్ అమన్ సెహ్రావత్ శుక్రవారం రోజున జరిగిన 57 కిలోల పోరులో 13-5తో దరియన్ టోయ్ క్రజ్ (ప్యూర్టోరికో) ను ఓడించాడు. ఒలింపిక్స్ బరిలో భారత్ తరఫున బరిలోకి దిగిన ఏకైక మేల్ ప్లేయర్ అయిన అమన్ ఈ ఒలింపిక్స్‌లో వ్యక్తిగత పతకం సాధించిన అతి పిన్న వయస్సు గల భారత అథ్లెట్‌గా రికార్డుకెక్కాడు అమన్కంటే ముందే ఈ రికార్డు బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు ఖాతాలో ఉండేది. 2016లో జరిగిన ఒలింపిక్స్‌లో ఆమె రజతం గెలిచినప్పుడు తన వయసు 21 ఏళ్ల 1 నెల 14 రోజులు.
అయితే అమన్ సహ్రావత్ గురించి ఓ ఆసక్తికరమైన విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. ఇటీవలే 100 గ్రాములు అధిక బరువు ఉండటంతో భారత స్టార్ రెజ్లర్ ఫైనల్లో అనర్హత వేటు పడి పోటీ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. అయితే అమన్ విషయంలో కూడా అలా జరిగే ఆస్కారం ఉండటంతో మేనేజ్మెంట్ ముందుగా జాగ్రత్త పడిందట. సెమీస్‌లో ఓటమి తర్వాత గత గురువారం నాడు అమన్ బరువు 61.5 కేజీలు ఉండటంతో కాంస్య పోరు (శుక్రవారం రాత్రి) నాటికి 57 కేజీలకు వచ్చేందుకు చాలా కష్టపడ్డాడట అమన్. కేవలం 10 గంటల వ్యవధిలో ఏకంగా 4.6 కేజీలు తగ్గాడట.
గురువారం రాత్రి 6.30 గంటలకు అమన్ సెమీస్‌లో తలపడి ఓడిపోవడంతో కాంస్య పోరులో తలపడే అవకాశం మాత్రమే ఉంది. అందుకోసం శుక్రవారం ఉదయం అమన్ బరువును కొలవగా 61.5 కేజీలు ఉన్నాడట. గేమ్‌కు సరిగ్గా 10 గంటల సమయం మాత్రమే ఉండటంతో సీనియర్ కోచ్‌లు జగమందర్ సింగ్, వీరేందర్ దహియాతోపాటు మరో ఆరుగురి బృందం అమన్‌ను గంటపాటు వేడినీళ్ల స్నానం, ఆగకుండా గంటసేపు ట్రెడ్‌మిల్‌పై రన్నింగ్, ఆ తర్వాత జిమ్‌లో కసరత్తులు, ఐదు సెషన్లపాటు ఐదేసి నిమిషాల చొప్పున సానా బాత్ చేయించారట. చివరి సెషన్ నాటికి 900 గ్రాములు అధిక బరువు ఉన్నట్లు కోచ్‌లు గుర్తించి నెమ్మదిగా జాగింగ్ చేయమని అమన్‌కు సూచించారట. అలా శుక్రవారం ఉదయం 4.30 గంటలకు అమన్ 56.9 కేజీలకు చేరాడట. తాను పోటీ పడిన వెయింట్ (57కేజీలు) కంటే వంద గ్రాములు తక్కువే ఉన్నాడు. దాంతో భారత బృందం ఊపిరి పీల్చుకుంది.