Mana Enadu:పారిస్ ఒలింపిక్స్‌లో అత్యుత్తమ ప్రదర్శనతో.. సంచలన ఆటతీరుతో.. ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్లోకి దూసుకెళ్లి.. ఆ రికార్డు సాధించిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా వినేశ్ ఫొగాట్ చరిత్ర సృష్టించింది. దేశాన్ని సంబరాల్లో ముంచెత్తింది. ఇక భారత్‌కు స్వర్ణం ఖాయం అని అంతా భావించారు. కానీ 24 గంటలు గడవకముందే కథ మారింది. ఎవరూ ఊహించని రీతిలో వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడింది. 50 కేజీల విభాగంలో పోటీ పడిన వినేశ్ 100 గ్రాములు అదనంగా బరువు ఉన్నట్లు గుర్తించిన నిర్వాహకులు ఆమెపై అనర్హత వేటు వేశారు. దీంతో యావత్ భారతావని దుఃఖసాగరంలో మునిగిపోయింది. దీన్నుంచి తేరుకోకముందే వినేశ్ ఫొగాట్ తీసుకున్న ఓ సంచలన నిర్ణయం ఇప్పుడు మరింత చర్చనీయాంశమైంది.
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ రెజ్లింగ్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించింది. ఈ మేరకు ఎక్స్‌లో ఎమోషనల్ పోస్టు చేసింది. ‘‘కుస్తీ నాపై గెలిచింది. నేను ఓడిపోయాను. నన్ను క్షమించు. మీ కల, నా ధైర్యం విచ్ఛిన్నమైంది. నాకు ఇంకా పోరాడే బలం లేదు’’ అని వినేశ్ ఫొగాట్ రాసుకొచ్చింది. మరోవైపు తనను అనర్హురాలిగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ ఫొగాట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్‌ను ఆశ్రయించింది. తాను సిల్వర్ మెడల్‌కు అర్హురాలినని అందులో పేర్కొన్నట్లు సమాచారం. దీనిపై ఆ ఆర్భిట్రేషన్ తీర్పు రావాల్సి ఉండగా.. ఇంతలోనే వినేశ్ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.
ఇక ఒలింపిక్ కమిటీ నిర్ణయం తర్వాత వినేశ్ అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి ఆఖరికి తీవ్రమైన డీహైడ్రేషన్‌తో క్రీడా గ్రామంలోని ఆస్పత్రిలో చేరింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే బరువు తగ్గేందుకు వినేశ్.. రాత్రంతా ఆహారం, నీరు లేకుండా కష్టపడిందని ఆమె కోచ్ తెలిపారు. చివరకు 100 గ్రాములు అధికంగా బరువుండటంతో పోటీలో పాల్గొనే అవకాశం లేకపోయిందని అన్నారు. వినేశ్ నీరసంగా కనిపించడంతో ముందస్తు జాగ్రత్తగా ఆమెను ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.