ManaEnadu:పారిస్ ఒలింపిక్స్‌లో భారతదేశానికి రజతం అందించాడు జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా. అదే విధంగా ఈ ఒలింపిక్స్‌లో దేశానికి రెండు కాంస్య పతకాలు అందించింది స్టార్ షూటర్ మను బాకర్. అయితే ఈ ఇద్దరు అద్భుత ఆటగాళ్ల గురించి గత రెండ్రోజులుగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో మను, నీరజ్ నవ్వుతూ మాట్లాడుకోవడం చూసి త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి చేసుకుంటారన్న పుకారు మొదలైంది. ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నారంటూ రూమర్ రావడంతో తాజాగా దీనిపై మను బాకర్ తండ్రి రామ్ కిషన్ బాకర్ స్పందించారు.
తన కుమార్తె మను ఇంకా చిన్న పిల్ల అని ఆమెకు పెళ్లి వయసు రాలేదని రామ్ కిషన్ బాకర్ మీడియాకు క్లారిటీ ఇచ్చారు. అసలు తాము మను వివాహం గురించి కనీసం ఆలోచన కూడా చేయడం లేదని.. సోషల్ మీడియాలో వచ్చే వీడియోపై ఆయన స్పందించారు. మరోవైపు పారిస్ ఒలింపిక్స్‌లోనే మను బాకర్ తల్లి.. నీరజ్ చోప్రాతో మాట్లాడుతూ.. అతడి చేయి తన తలపై పెట్టుకుని ఒట్టు వేయించుకుంటున్న ఓ వీడియో వైరల్ అయింది. అసలు ఈ వీడియోతోనే మను, నీరజ్ పెళ్లి రూమర్స్‌కు బలం చేకూరింది.
అయితే దీనిపై కూడా రామ్ కిషన్ స్పందించారు. నీరజ్‌ను తన భార్య బిడ్డలా భావిస్తుందని.. అయితే ఆ వీడియోలో కనిపించినట్టు వాళ్ల మధ్య జరిగిన సంభాషణ గురించి తనకూ క్లారిటీ లేదని చెప్పుకొచ్చారు. మరోపక్క నీరజ్ బంధువు కూడా ఈ ఊహాగానాలపై స్పందిస్తూ.. . ‘‘నీరజ్ పతకం తెచ్చినప్పుడు దేశం మొత్తం ఎలా చూసిందో అలాగే అతని పెళ్లి విషయం కూడా అందరికీ తెలుస్తుంది’’ అని అన్నారు. ఈ ఇద్దరి ఆటగాళ్ల స్వరాష్ట్రం హరియాణానే.
ఇక టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాన్ని సాధించిన నీరజ్ చోప్రా.. తాజా ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ సాధించాడు. నీరజ్ వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించాడు. మరోవైపు మను బాకర్ 10 మీటర్ల పిస్టల్‌లో రెండు కాంస్యాలు దక్కించుకుంది. పారిస్ ఒలింపిక్స్ వేదికగా 124 ఏళ్ల రికార్డును తిరగరాస్తూ.. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత, మిక్స్‌డ్ టీమ్ విభాగాల్లో పతకాలను సాధించింది.