ManaEnadu:తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం తెల్లవారుజాము నుంచి ఏకధాటిగా వాన (Heavy Rain Today) పడుతోంది. రాష్ట్రంలోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇక హైదరాబాద్ మహానగరంలో లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. చాలా ప్రాంతాల్లో వరద (Hyderabad Floods) ఇళ్లలోకి చేరి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక జాతీయ రహదారులపైకి వరద నీరు చేరి వాహనదారుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఈ నేపథ్యంలో భారీ వర్షాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇవాళ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో అధికారులు, సిబ్బంది ఎవరూ సెలవులు పెట్టొద్దని ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సహాయం కోసం చర్యలు చేపట్టాలని సూచించారు. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిస్థితులు పరిశీలిస్తూ రిపోర్టు అందించాలని చెప్పారు.
మరోవైపు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. ఏ అవసరం వచ్చినా అధికారులకు ఫోన్‌లో సమాచారం ఇవ్వాలని చెప్పారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహాయక చర్యల్లో పాల్గొనాలని.. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలని సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఇక నిన్నటి నుంచిహైదరాబాద్ పరిసరాల్లో భారీ వర్షాలు (Hyderabad Rains) కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా మూసీ నదికి వరద ప్రవాహం పెరిగి.. వలిగొండ మండలం సంగెం గ్రామ సమీపంలోని భీమలింగం వద్ద లో లెవల్ బ్రిడ్జిని తాకుతూ మూసీ నది ప్రవహిస్తోంది. మూసీ (Musi River Floods) ప్రమాదకరంగా ప్రవహిస్తుండటంతో సంగెం గ్రామ సమీపంలోని బ్రిడ్జికి ఇరువైపులా వాహనాలను పోలీసులు నిలిపివేశారు.
మరోవైపు జిల్లాలోని బీబీనగర్ మండలం రుద్రవెల్లి వద్ద మూసీ ఉప్పొంగుతూ.. రుద్రవెల్లి గ్రామ సమీపంలోని లోలెవల్ వంతెనను తాకుతూ మూసి వరద ప్రవహిస్తోంది. దీంతో బీబీనగర్, పోచంపల్లి మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయి ప్రజలకు ఇబ్బందిగా మారింది.
హైదరాబాద్ పరిసరాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మూసీ నదికి వరద పోటెత్తే అవకాశం ఉందని.. ఈ రెండు గ్రామాల పరిధిలో లో లెవల్ బ్రిడ్జిల పైనుంచి ప్రయాణికులు దాటే సాహసం చేయవద్దని పోలీసులు ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తున్నారు. వర్షాలు కురుస్తున్న సమయంలో అత్యవసరమైతే తప్ప అసలు బయటకు రావొద్దని సూచిస్తున్నారు.