ManaEnadu:దిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Excise Policy Case) కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటీవలే బెయిల్ పై విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో ఆమె బుధవారం రోజున దిల్లీ తిహాడ్ జైలు నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఇక ఇవాళ ఆమె సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌజ్ లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి, తన తండ్రి కేసీఆర్ (KCR) ను కలవడానికి వెళ్లారు.
తన భర్త అనిల్, కుమారు ఆదిత్యతో కలిసి ఎర్రవల్లికి వెళ్లిన కవితకు ఆ గ్రామస్థులు మంగళహారతులతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆమె కేసీఆర్ వద్దకు వెళ్లి ఆయన పాదాలకు నమస్కరించింది. దాదాపు ఐదు నెలల తర్వాత తన కుమార్తె(Kavitha Meets KCR) ను చూసి కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. కుమార్తెను గుండెల నిండా కౌగిలించుకుని ఆశీర్వదించారు. చాలా నెలల తర్వాత తన బిడ్డను చూసిన గులాబీ బాస్ ఆనందంతో ఉప్పొంగిపోయారు.
ఇక కేసీఆర్ ను కలిసిన తర్వాత తన తండ్రిని హగ్ చేసుకున్న ఫొటోను కవిత (Kavitha Insta Post) నెట్టింట షేర్ చేశారు. ఈ ఫొటోకు ఏ క్యాప్షన్ ఇవ్వకపోయినా.. ఆ ఫొటో వందల మాటలు చెబుతోంది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫొటోకు క్షణాల్లో వేలల్లో లైకులు వచ్చాయి. ఇక బీఆర్ఎస్, కేసీఆర్ అభిమానులు ఈ ఫొటో కింద కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ పదిరోజుల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోనున్నట్లు తెలిపారు. నేతలు, కార్యకర్తలు, అభిమానులు సహకరించాలని కోరారు.
దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈ ఏడాది మార్చి 15వ తేదీన కవితను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మార్చి 26న కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. అప్పటి నుంచి తిహాడ్ జైల్లో ఉన్న కవిత 164 రోజుల తర్వాత జైలు నుంచి విడుదల అయ్యారు. ఈడీ, సీబీఐ కేసుల్లో కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో తీహాడ్ జైలు నుంచి బయటకు వచ్చారు.