TG:సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ.. డిసెంబర్ 9న ఆవిష్కరణ

ManaEnadu:రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు అడుగు ముందు పడింది. విగ్రహం ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ (ఆగస్టు 28వతేదీ) భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. డిసెంబర్‌ 9వ తేదీన తెలంగాణ తల్లి (Telangana Talli Statue) విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. శంకుస్థాపన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వం సంకల్పించిందని సీఎం తెలిపారు. సచివాలయం (Telangana Secretariat)లో విగ్రహ ఏర్పాటుపై జూన్‌ 2న ప్రకటించానని.. తెలంగాణ ఏర్పాటుకు డిసెంబర్‌ 9 పునాది రాయిగా మారిందని వెల్లడించారు. అందుకే రాష్ట్ర ప్రజలకు డిసెంబర్‌ 9 పండుగ రోజు అన్న సీఎం.. ఆరోజునే తెలంగాణ తల్లి విగ్రహ ప్రారంభోత్సవం జరుపుకోబోతున్నామని ప్రకటించారు.

60 ఏళ్ల తెలంగాణ ఆకాంక్షను సోనియా గాంధీ నెరవేర్చారని పునరుద్ఘాటించారు. 2014లో తెలంగాణ ఏర్పాటు కల సాకారమైందన్న ముఖ్యమంత్రి (CM Revanth Reddy).. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు గత పాలకులకు మనసు రాలేదని విమర్శించారు. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటును తెరమరుగు చేశారని మండిపడ్డారు. తామే తెలంగాణ అనే విధంగా గత పాలకులు వ్యవహరించారని.. ప్రగతి భవన్‌ (Pragati Bhavan)లో గడి నిర్మించుకుని పోలీసు పహారా పెట్టారని ఆరోపించారు.

కానీ గత ప్రభుత్వ విధానాలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యతిరేకమని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ప్రగతి భవన్‌ను ప్రజా భవన్‌గా మార్చామని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని వెల్లడించారు. రాష్ట్ర ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన నేతల ఆనవాళ్లు ఇక్కడ ఉన్నాయన్న ఆయన.. రాజీవ్‌గాంధీ విగ్రహం లేకపోవడం లోటుగా భావించామని పేర్కొన్నారు. అందుకే రాజీవ్‌గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలని మేధావులు సూచించారని చెప్పారు.

Share post:

లేటెస్ట్