తెలంగాణలో 33 జిల్లాలకు రెడ్ అలర్ట్.. ఏపీలో పలు జిల్లాల్లో అతిభారీ వర్షాలు

ManaEnadu:వాయుగుండం ప్రభావంతో శనివారం ఉదయం నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేని వాన కురుస్తోంది. అయితే ఆదివారం, సోమవారం కూడా ఇరు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.  ఇవాళ (సెప్టెంబర్ 1వ తేదీ) ఉత్తర తెలంగాణ (Telangana Rain Alert) జిల్లాల్లో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. సోమవారం (సెప్టెంబరు 2వ తేదీ) దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 33 జిల్లాలకు రెడ్ (Telangana Red Alert), ఆరెంజ్, ఎల్లో అలర్ట్ ను జారీ చేశారు.

అర్ధరాత్రి కలింగపట్నం ప్రాంతంలో వాయుగుండం తీరాన్ని దాటడంతో దాని ప్రభావం రాష్ట్రంపై పడిందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే మహబూబాబాద్, సూర్యాపేట, ఖమ్మం, జనగాం జిల్లాల్లో గడిచిన 24గంటల్లో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు (Heavy Rains in Telangana) పడ్డాయని పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తిలో 43.8, వరంగల్ జిల్లా నెక్కొండ మండలం రెడ్లవాడలో 43.5, సూర్యాపేట జిల్లా ముకుందాపురం 42.5, ఖమ్మం జిల్లా కాకర్వాయి 42.2, ములుగు జిల్లా తాడ్వాయిలో 25 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు చెప్పింది.

మరోవైపు ఏపీలోనూ వాయుగుండం ప్రభావం తీవ్రంగా ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.  వాయుగుండం ఆదివారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో కళింగపట్నం సమీపంలో తీరం దాటడంతో ఇవాళ రాష్ట్రంలో చాలా చోట్ల మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

విశాఖ, అనకాపల్లి, కోనసీమ, ఉభయగోదావరి జిల్లాలు, వైఎస్‌ఆర్‌, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.  భారీ వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. రాష్ట్రంలో (AP Rains Updates)ని కళింగపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు మూడో నంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. 

Share post:

లేటెస్ట్