ManaEnadu:తెలంగాణలో గత కొన్ని రోజులుగా భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. పగటిపూట ఎండ దంచికొడుతుండగా.. సాయంకాలం కాగానే వరణుడు చిరుజల్లలు (Telangana Rains)లతో పలకరిస్తున్నాడు. అయితే ఏకధాటిగా కురవకుండా రోజుకో సారి ఓ పది నిమిషాల పాటు వర్షం పలకరించిపోతోంది. రాష్ట్ర వాతావరణ పరిస్థితులపై తాజాగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం (Hyderabad Meteorological Centre) ఓ ప్రకటన జారీ చేసింది. రాష్ట్రంలో రానున్న ఆరు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇవాళ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.
ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్..
తూర్పు మధ్య పరిసర ఉత్తర బంగాళాఖాతం (Bay Of Bengal)లో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో ఇవాళ (బుధవారం) ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, నిజామాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో మోస్తరు వాన పడే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం రోజున వరంగల్, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల్లో వానలు కురుస్తాయని తెలిపింది.
పిడుగులు పడే అవకాశం..
మరోవైపు భారీ వర్షాలతో పాటు ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది. గంటకు 30 కిలోమీటర్ల నుంచి 40కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులతో పాటు ఉరుములు, మెరుపులు, పలు చోట్ల పిడుగులు (Lightening in Telangana) కూడా పడే అవకాశం ఉందని తెలిపింది. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షం కురుస్తున్న సమయంలో బయటకు వెళ్లకూడదని సూచించింది. ముఖ్యంగా పొలంలో పని చేస్తున్నవారు చెట్ల కిందకు వెళ్లకూడదని పేర్కొంది.
భాగ్యనగరంలో భిన్న వాతావరణం..
అయితే హైదరాబాద్ (Hyderabad Rains)లో మాత్రం వాతావరణం పొడిగా ఉంటుందని వెల్లడించింది. ఉదయం పూట కాస్త ఎండగా అనిపించినా.. మధ్యాహ్నం దాటిన తర్వాత వాతావరణం కాస్త చల్లబడుతుందని చెప్పింది. సాయంత్రం పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వాతావరణ శాఖ హెచ్చరికతో జీహెచ్ఎంసీ బృందాలు అప్రమత్తమయ్యాయి. గతవారం కురిసిన వర్షం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అయితే మరోసారి అలాంటి పరిస్థితులు రాకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.