ManaEnadu:తెలంగాణలో హైడ్రా (Hyderabad Disaster Response and Assets Monitoring and Protection) దూకుడు కొనసాగుతోంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా, విన్నా హైడ్రా పేరే వినిపిస్తోంది. అయితే ఇన్నిరోజులు దీని పేరు చెబితే అక్రమార్కులు గడగడలాడిపోయారు. నాలాలు, చెరువులు, కుంటలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినవారు భయంతో వణికిపోయారు. ఎప్పుడు హైడ్రా ఉప్పెనలా తమ మీద పడుతుందోనని ఆక్రమణదారులు భయపడ్డారు. అయితే తాజాగా వారితోపాటు అక్రమంగా అనుమతులు ఇచ్చిన వారిపై హైడ్రా కొరడా ఝుళిపిస్తోంది. దీంతో పలువురు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. తాజాగా ఆరుగురు అధికారులపై హైడ్రా ఫిర్యాదు చేయగా సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. త్వరలో మరికొందరిపై కేసులు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రాష్ట్ర రాజధాని నగరంలో హైడ్రా మరింత దూకుడు పెంచింది. హైడ్రా ఫిర్యాదుతో ఆరుగురు అధికారులపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిజాంపేట్ మున్సిపల్ కమిషనర్, చందానగర్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్, HMDA APO, బాచుపల్లి తహశీల్దార్, మేడ్చల్ జిల్లా సర్వే అధికారిపై కేసు నమోదు అయ్యింది. EOWలో పోలీసులు కేసు నమోదు చేశారు. త్వరలో మరికొందరు అధికారులపైనా కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. భాగ్యనగరం పరిధిలోని చెరువు, ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మించిన కట్టడాలను హైడ్రా నేలమట్టం చేస్తోంది. అయితే.. ఈ వ్యవహారంలో అధికారుల పాత్ర కూడా ఉందని హైడ్రా భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే అక్రమ కట్టడాలకు సహకరించిన వారి వివరాలు సేకరిస్తోంది. ప్రాథమికంగా ఆరుగురిని గుర్తించిన హైడ్రా వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కొనసాగుతోన్న కూల్చివేతలు
మరోవైపు హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. రాజేంద్రనగర్ అప్ప చెరువు సమీపంలో.. బీజేపీ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డికి చెందిన అక్రమ కట్టడాలను హైడ్రా నేలమట్టం చేసింది. శనివారం తెల్లవారుజాము నుంచే కూల్చివేతలు ప్రారంభించింది. రేపు ఆదివారం కావడంతో.. కూల్చివేతలు కొనసాగే అవకాశం ఉంది. సంగారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్ మండలంలో ఉన్న పలు చెరువులను పరిశీలించనున్నారు. అమీన్‌పూర్‌లోని వెంకటరమణ కాలనీ, చక్రపురి కాలనీలల్లో సర్వే చేసి అక్రమ నిర్మాణాలను గుర్తించనున్నారు. ఇక హైడ్రా చర్యల పైన హైడ్రా కమిషనర్ రంగనాథ్(Hydra Commissioner Ranganath)) మాట్లాడుతూ హైడ్రా వ్యవస్థ కొద్దిరోజులు హడావిడి చేసి ఊరుకునే వ్యవస్థ కాదని ఎవరైనా ఆక్రమణలకు పాల్పడాలంటే భయపడేలా చేస్తామని పేర్కొన్నారు. కొంతమంది అక్రమ నిర్మాణాలకు అధికారిక అనుమతులు ముసుగు తొడుగుతున్నారని తెలిపిన రంగనాథ్ వారి కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునేలోగా వాటిని నేలమట్టం చేస్తామని హెచ్చరించారు.