ED Raids at MLC Kavitha’s House : దిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ, ఐటీ అధికారులు సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఇద్దరు మహిళా అధికారులు సహా 8 మంది అధికారుల బృందం, ఐటీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేశారు. సోదాల సందర్భంగా ఇంట్లో ఉన్న అందరి వద్ద సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్న ఈడీ అధికారులు, పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. కవిత వాంగ్మూలం నమోదు చేశారు. అంతకుముందు దాడుల నేపథ్యంలో బీఆర్ఎస్ లీగల్ కన్వీనర్ సోమ భరత్, లాయర్లు కవిత నివాసానికి చేరుకోగా, అధికారులు ఆమె ఇంట్లోకి ఎవరినీ అనుమతించ లేదు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కవిత నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
IT Raids at MLC Kavitha’s House : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్లీ మద్యం కుంభకోణం కేసులో విచారణకు రావాల్సిందిగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గతంలో జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. మహిళల విచారణలో సీఆర్పీసీ నిబంధనలు పాటించడం లేదని ఆరోపిస్తూ కవిత సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. తనపై ఈడీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలని అందులో కోరారు. ఈ పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం ఇప్పటికే పలుమార్లు విచారించింది. నేడు విచారణకు రాగా, ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది.