ఖమ్మం జిల్లాలో వరద విలయం.. పెను విషాదంలో ప్రజలకు అండగా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

ManaEnadu:భారీ వర్షాలు ఖమ్మం జిల్లా (Khammam District)ను కోలుకోలేని దెబ్బ తీశాయి. మున్నేరు ఎన్నడూ లేని విధంగా ఉప్పొంగి పరివాహక ప్రాంతాల ప్రజలకు కన్నీరు మిగిల్చింది. మున్నేరు ముంపు వల్ల ప్రజల జనజీవనం అస్తవ్యస్తమైంది. వరదలు వచ్చి వారం దాటినా ఇంకా అక్కడి ప్రజలు ఈ విలయం నుంచి కోలుకోలేకపోతున్నారు. ఎంతో కష్టపడి.. మరెంతో ఇష్టంగా కట్టుకున్న తమ పొదరిల్లు వరద ధాటిగా పూర్తిగా దెబ్బతిని బురదమయం కావడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. నిలువనీడ లేక, కట్టుకునేందుకు బట్టలేక, తినేందుకు తిండిలేక.. ఇప్పట్లో సాధారణ పరిస్థితులు వచ్చేనా అంటూ బాధితులు బోరుమంటున్నారు.

మున్నేరు మిగిల్చిన కన్నీరు..

మున్నేరు (Munneru Overflow) ముంపు ఖమ్మం జిల్లాలో తీరని నష్టాన్ని కలిగించింది. ప్రజా, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసింది. ఇంటిల్లిపాది రెక్కలు ముక్కలు చేసుకుని సాగు చేసిన పంటంతా వరదమయం కావడంతో రైతులు తల్లడిల్లుతున్నారు. ఇటు చూస్తే నిలువనీడ లేదు.. కట్ట గుడ్డ లేదు.. అంటు చూస్తే తిండికి దిక్కులేదు.. ఇదంతా పోయినా.. తామేసిన పంట (Crop Damage) మిగిలినా కాస్త ధైర్యంగా ఉండేదంటూ రైతులు దిగాలు పడుతున్నారు. ఇక పుస్తకాలు, సర్టిఫికెట్లు వంటి విలువైనవి నష్టపోయి విద్యార్థులు బోరున విలపిస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టులు, ప్రధాన కాల్వలు, చెరువులకు భారీ నష్టం.. పశుసంపద, మత్య్ససంపదకు అపార నష్టం కలిగింది. ఇలా రంగం ఆ రంగం అని తేడా లేకుండా వరదలు అన్ని ప్రభుత్వ శాఖలను కోలుకోలేని దెబ్బతీశాయి. జిల్లాలో 417.69 (Khammam Floods Damage) కోట్ల మేర నష్టం జరిగినట్లు జిల్లా యంత్రాంగం అంచనా వేస్తోంది.

విలయంలో సాయంగా..

అయితే ఇంతటి పెను విధ్వంసంలో జిల్లా ప్రజలకు అండగా ఆ జిల్లా కలెక్టరు ముజమ్మిల్ ఖాన్ ( Khammam Collector Muzammil Khan) నిలుస్తున్నారు. వర్షాలు మొదలైన రోజు నుంచి వరదలు విలయం సృష్టించి. . ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ఈ నిమిషం వరకు ఆయన ప్రజలకు తోడుగా నిలుస్తూ వారికి భరోసా కల్పిస్తున్నారు. ప్రతిరోజు కోడికూసిందే మొదలు ఆయన రంగంలోకి దిగి.. అధికార యంత్రాంగంతో కలిసి జిల్లాలోని వీధివీధి తిరుగుతున్నారు. అక్కడి ప్రజల పరిస్థితులు తెలుసుకుని వారికి కావాల్సిన సాయం అందిస్తున్నారు. ఇంతటి కష్టంలో వారికి తానున్నాననే ఆసరాను కలిగిస్తున్నారు.

ఆపదలో అండగా..

అటు వరద ముంపున (Khammam Floods)కు గురైన ప్రాంతాల్లో కలియతిరుగుతూ బాధితులకు భరోసా కల్పిస్తున్నారు. త్వరలోనే సాధారణ పరిస్థితులు వస్తాయంటూ ధైర్యం నూరిపోస్తున్నారు. వారు సాధారణ పరిస్థితుల్లోకి వచ్చేందుకు ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి సాయం చేస్తున్నారు. అప్పటి వరకు వారికి కావాల్సిన సామగ్రిని అందిస్తూ తోడుగా నిలుస్తున్నారు. మరోవైపు పుస్తకాలు, సర్టిఫికెట్లు కోల్పోయి బోరుమంటున్న విద్యార్థులకు ఆయన ధైర్యం చెబుతున్నారు. ప్రస్తుతం విద్యార్థులకు కావాల్సిన పుస్తకాలు అందిస్తూ వారు నిరాశ చెందకుండా చేస్తున్నారు. మరోవైపు సర్టిఫికెట్లు కోల్పోయిన వారికి తిరిగి కొత్తవి ఇప్పిస్తానంటూ భరోసా ఇస్తున్నారు. అలా నిత్యం ప్రజల్లో ఉంటూ కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ప్రజల మనిషిగా మారిపోయారు. ఈ కష్టకాలంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి ఇంట్లో మనిషిగా మారిపోయారు.

Share post:

లేటెస్ట్