దేశంలో మరోసారి అధికారం దక్కించుకునేందుకు.. అతిపెద్ద పార్టీగా అవతరించేందుకు భారతీయ జనతా పార్టీ కేంద్ర అధిష్టానం చకచకా పావులు కదుపుతోంది. ఈ లోక్‌సభ ఎన్నికల్లో దాదాపు 360కి పైగా స్థానాలు బీజేపీ దక్కించుకునే అవకాశముదని సర్వేలు చెబుతున్నాయి. ఈ అవకాశాన్ని వాడుకునేందుకు ఆచితూచి అడుగులేస్తోంది కమల దళం. అందులో భాగంగానే స్థానిక సమీకరణాలు, గెలుపు అవకాశాలను అంచనా వేసుకునే అభ్యర్థుల ఎంపిక చేపడుతోంది.
తప్పుడు నిర్ణయాలతో తెలంగాణ అసెంబ్లీ గెలుపును చేజార్చుకున్నామన్న భావనలో ఉన్న బీజేపీ.. ఎంపీ ఎన్నికల్లో అయినా ఉనికి చాటుకోవాలని చూస్తోంది. సీట్ల ఖరారులో రేపు దిల్లీలో జరిగే తుది సమావేశంలో పార్టీ జాతీయాధ్యక్షుడు నడ్డా, హోంమంత్రి అమిత్ షాతో సహా కేంద్ర కమిటీ, రాష్ట్రం నుంచి భాజపా ఛీఫ్ కిషన్ రెడ్డి, జాతీయ కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్, ఈటల, లక్ష్మణ్ పాల్గొననున్నారు. అయితే అన్ని పార్టీల తర్వాతే ప్రకటించేందుకు భారాస, కాంగ్రెస్ ఎదురుచూస్తుండగా.. తొలి జాబితాలో 10 మందిని ప్రకటించేందుకు భాజపా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. దాదాపు అన్ని స్థానాలకు పోటీ ఉండగా.. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ స్థానాలు ఖరారైనట్లు తెలిసింది.
కరీంనగర్ – బండి సంజయ్
నిజామాబాద్ – ధర్మపురి అర్వింద్
సికింద్రాబాద్ – గంగాపురం కిషన్‌రెడ్డి
మెదక్ – రఘునందన్ రావు
మల్కాజ్‌గిరి – ఈటల రాజేంధర్
పెద్దపెల్లి – కొప్పు భాషా
ఆదిలాబాద్ – సోయం బాపూరావు
మహబూబ్‌నగర్ – డీకే అరుణ
చేవెళ్ల – కొండా విశ్వేశ్వర్ రెడ్డి
భువనగిరి – బూర నర్సయ్య గౌడ్