ManaEnadu:ప్రస్తుత తరంలో చాలా మంది విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారు. కొంతమంది విదేశీ వీధుల్లో విహరించడం కోసం వెళ్తుంటే.. మరికొందరు అక్కడే సెటిల్ అవ్వడానికి వెళ్తున్నారు. ఇంకొందరేమో చదువు కోసం, ఉద్యోగం కోసం విదేశాలకు పయనమవుతున్నారు. అయితే విదేశాలకు వెళ్లాలంటే పాస్‌పోర్టు (Passport) తప్పనిసరి. ఈ నేపథ్యంలో పాస్‌పోర్టు సేవలపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఇవాళ రాత్రి (ఆగస్టు 29వతేదీ) నుంచి ఐదు రోజుల పాటు ఆన్‌లైన్ పాస్‌పోర్టు (Online Passport) సేవలకు స్వల్ప అంతరాయం కలగనుందని కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది. ఆన్‌లైన్ పోర్టల్ నిర్వహణ సంబంధిత కార్యకలాపాల కోసం వాటిని నిలిపివేస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ఐదు రోజుల్లో కొత్త అపాయింట్‌మెంట్లు ఏవీ షెడ్యూల్ చేసే వీలు ఉండదని స్పష్టం చేసింది. ఇప్పటికే చేసుకున్న బుకింగ్‌లు రీషెడ్యూల్ అవుతాయని కంగారు పడాల్సిందేం లేదని వెల్లడించింది.
‘‘సాంకేతిక నిర్వహణ సంబంధిత కార్యకలాపాల దృష్ట్యా పాస్‌పోర్టు సేవా పోర్టల్ (Online Passport Portal) సేవలు గురువారం రాత్రి ఎనిమిది గంటల (ఆగస్టు 29) నుంచి సోమవారం ఉదయం ఆరు గంటల(సెప్టెబర్ 2) వరకు అందుబాటులో ఉండవు. ఆగస్టు 30వ తేదీకి చేసుకున్న అపాయింట్‌మెంట్లు రీషెడ్యూల్ చేస్తాం. దీనికి సంబంధించిన వివరాలను దరఖాస్తు చేసుకున్న వారికి పంపిస్తాం ’’ అని పాస్‌పోర్టు సేవా పోర్టల్ ఓ ప్రకటనలో పేర్కొంది. దీనిపై భారత విదేశాంగశాఖ స్పందిస్తూ.. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియే అని వెల్లడించింది. దీనివల్ల ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రణాళిక ప్రకారమే ముందుకువెళ్తున్నామని తెలిపింది.
పాస్‌పోర్టు సేవా పోర్టల్ ద్వారా కొత్త పాస్‌సోర్టులు లేక వాటి పునరుద్ధరణ కోసం దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రాల్లో అపాయింట్‌మెంట్లు బుక్ చేసుకుంటారన్న విషయం తెలిసిందే. అపాయింట్‌మెంట్ ఇచ్చిన రోజున వాళ్లు చెప్పిన సమయానికి దరఖాస్తుదారుడు పాస్‌పోర్టు కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడు వారు సదరు వ్యక్తికి సంబంధించిన డాక్యుమెంట్లు వెరిఫికేషన్ చేస్తారు. ఆ తర్వాత పోలీసు వెరిఫికేషన్ జరుగుతుంది. ఇక ఆ తర్వాత దరఖాస్తుదారుడి అడ్రస్‌కు పాస్‌పోర్టు చేరుతుంది.