ManaEnadu:వానాకాలం వచ్చింది.. వైరల్ జ్వరాలు తెచ్చింది. జ్వరాలతో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం వణికిపోతోంది. ముఖ్యంగా డెంగీ రోజురోజుకు విజృంభిస్తూ ప్రాణాలు హరిస్తోంది. ఇక గన్యా, మలేరియా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలోని ఆస్పత్రులన్నీ జ్వరం బాధితులతో కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో బాధితుల సంఖ్య పెరుగుతూ ఉండటం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది.
రాష్ట్రంలో ఉదయమంతా ఎండ దంచికొడుతోంటే.. సాయంత్రం అయ్యే సరికి వరణుడు విజృంభిస్తున్నాడు. ఈ భిన్న వాతావరణం వల్ల చాలా మందికి అనారోగ్య పరిస్థితులు ఎదురవుతున్నాయి. జలుబు, దగ్గు, శ్వాస సంబంధిత వ్యాధులు విస్తరిస్తున్నాయి. వర్షాల కారణంగా పారిశుద్ధ్యం లోపించడంతో దోమల వ్యాప్తి పెరిగి డెంగీ, మలేరియా, గన్యా జ్వరాలు చుట్టుముడుతున్నాయి. ప్రధానంగా హైదరాబాద్, సూర్యాపేట, రంగారెడ్డి, మేడ్చల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో డెంగీ కేసులతో జనం రోజుల తరబడి మంచం పడుతున్నారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు 4,395 డెంగీ కేసులు నమోదుకాగా, హైదరాబాద్‌లోనే అందులో మూడోవంతు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. కొన్నిచోట్ల డెంగీ బారిన పడిన వారు మరణిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణం, ఏజెన్సీ ప్రాంతాల పరిధిలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కొన్ని కుటుంబాల్లో ఇద్దరికంటే ఎక్కువ మంది జ్వరాల బారిన పడి ఆసుపత్రులకు బారులు తీరుతున్నారు. అయితే ఇది జ్వరాల సీజన్ అయినందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. దోమల ద్వారా ఎక్కువగా జ్వరాలు వ్యాప్తి చెందుతున్నందున దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.. వేడి నీళ్లు తాగాలని.. నిల్వ ఉంచిన పదార్థాలు సేవించొద్దని సూచిస్తున్నారు.